'మ్యాడ్' డైరెక్టర్ దెయ్యాల కథ.. ప్లాన్ ఏంటీ?

టాలీవుడ్ లో ఒక్క హిట్టు పడితే చాలు, ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోతుంది. 'మ్యాడ్' సినిమాతో యూత్ కు పిచ్చెక్కించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారారు.;

Update: 2025-11-29 20:30 GMT

టాలీవుడ్ లో ఒక్క హిట్టు పడితే చాలు, ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోతుంది. 'మ్యాడ్' సినిమాతో యూత్ కు పిచ్చెక్కించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారారు. మొదటి సినిమాతోనే నవ్వుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు, తన మూడో ప్రాజెక్ట్ కోసం వేస్తున్న స్కెచ్ ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా ఆయన రిజిస్టర్ చేయించిన ఒక టైటిల్, వినిపిస్తున్న హీరో పేరు చూస్తుంటే.. ఏదో కొత్త ప్రయోగం జరగబోతోందని అర్థమవుతోంది.

అసలు విషయానికి వస్తే.. కళ్యాణ్ శంకర్ తన తర్వాతి సినిమా కోసం "MAD జూనియర్స్" అనే వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. పేరులో 'మ్యాడ్' ఉన్నా, పాత సినిమా కథకు దీనికి అస్సలు సంబంధం లేదట. పైగా ఇదొక హారర్ కామెడీ జానర్ అని తెలుస్తోంది. కాలేజీ జోకులు కాకుండా, ఈసారి భయపెడుతూనే నవ్వించడానికి దర్శకుడు రెడీ అయ్యాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఈ టైటిల్ వినగానే ఇందులో అంతా కొత్తవారే ఉంటారని, చిన్న పిల్లలు లేదా టీనేజర్స్ తో చేసే సినిమా అని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఇందులో ఒక పెద్ద స్టార్ హీరో ఉండబోతున్నాడట. మొదట మాస్ మహారాజా రవితేజ పేరు వినిపించినా, ఇప్పుడు కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ కార్తీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ కాంబినేషన్ ను సెట్ చేసిందని గట్టిగా వినిపిస్తోంది.

అయితే ఇక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. కార్తీ లాంటి స్టార్ హీరో సినిమాకు "MAD జూనియర్స్" అనే టైటిల్ పెడతారా? అనేది సందేహం. బహుశా సినిమాలో కార్తీ ఒక లీడర్ లా ఉండి, అతని వెనుక ఉండే కుర్రాళ్ల టీమ్ ను ఉద్దేశించి ఈ టైటిల్ పెట్టారా? లేక ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనా? అనే క్లారిటీ రావాల్సి ఉంది. కార్తీకి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ఈ హారర్ కామెడీ జానర్ ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

నిర్మాత నాగవంశీ ఇప్పటికే సూర్యతో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తమ్ముడు కార్తీని కూడా ఒక సినిమా అయితే అనుకుంటున్నారు. సితార బ్యానర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని అర్థమవుతోంది. కొత్త వాళ్లతో చేయాల్సిన కథలో కార్తీని పెట్టారా, లేక కార్తీ కోసమే ఈ కథను మార్చారా అనేది తెలియాలి. ఏది ఏమైనా, ఒక పక్క హారర్, మరో పక్క కామెడీ హైలెట్ అవుతుందని టాక్. మొత్తానికి "MAD జూనియర్స్" అనేది చిన్న సినిమానా లేక కార్తీతో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టా అనేది త్వరలోనే తేలిపోనుంది. ఒకవేళ కార్తీనే హీరో అయితే మాత్రం, కళ్యాణ్ శంకర్ జాక్ పాట్ కొట్టినట్లే.

Tags:    

Similar News