తిరువీర్ 'పాపం ప్రతాప్'.. టికెట్ రేట్ రీజనబుల్ గానే ఉందే!

ఆయన లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ అవ్వనుంది.;

Update: 2026-04-16 05:36 GMT

వైవిధ్యమైన కథలు, నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ చిత్రాల హీరో తిరువీర్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ అవ్వనుంది.

అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన పాపం ప్రతాప్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో హీరో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "సోషల్ మీడియాలో కామెంట్స్ చదువుతున్నా. 'అన్నా మంచి సినిమాలు చేస్తావ్ గానీ, నీ సినిమా వచ్చిందని కూడా తెలియదన్నా' అని చాలా మంది చెబుతున్నారు. ఈ విషయాన్ని నేను కూడా సీరియస్‌ గా తీసుకున్నా" అని తిరువీర్ తెలిపారు.

అందుకే ఈసారి పాపం ప్రతాప్ సినిమాకు ఎంతగా ప్రమోషన్ చేయాలో అంతగా చేశానని చెప్పారు. "జనాల్లోకి సినిమా చేరాలంటే కథకు దగ్గరగా ఉండే విధంగా ప్రమోషన్స్ చేశాం. జట్కా పంచాయతీ వంటి వినూత్న కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఈసారి మాత్రం ప్రజలకు మా సినిమా గురించి తెలిసిందనే నమ్మకం ఉంది" అని తెలిపారు తిరువీర్.

టికెట్ ధరలపై వస్తున్న కామెంట్లకు స్పందిస్తూ, "టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ చూశాం. అందుకే ఈసారి రూ.105కి రీజనబుల్ టికెట్ ప్రైస్ అందుబాటులో ఉంచాం. మీరే చెప్పినట్టు చేశా. ఇప్పుడు మీరు ఇచ్చే ఫలితాన్ని ఎదురుచూస్తున్నా" అని అన్నారు. అయితే ఎస్‌.పి. దుర్గా నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన పాపం ప్రతాప్ చిత్రం 1990ల కాలం నాటి గోదావరి ప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.

కథ విషయానికి వస్తే.. ప్రతాప్ (తిరువీర్) అనే సాధారణ యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఓ చిన్న సంఘటన కారణంగా గ్రామ పంచాయతీలో ఎదురైన అవమానం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ సంఘటన తర్వాత ఏమైంది? ప్రతాప్ ఎలా మారాడు? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌ గా నటించగా, అజయ్ ఘోష్, రాశి, రఘుబాబు వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.ఎమ్. రాధాకృష్ణ అందించిన సంగీతం ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.1998 కాలం నాటి గోదావరి గ్రామీణ వాతావరణాన్ని నేచురల్ గా చూపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి, విభిన్న కథలు ఎంచుకునే తిరువీర్ ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌ తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి పాపం ప్రతాప్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News