స్టార్ సింగర్ పీరియడ్స్ విషయంలో క్యాన్సర్ అపోహ!
పెరిగే వయసులో పిల్లల్లో ఎదురయ్యే శారీరక మార్పుల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
పెరిగే వయసులో పిల్లల్లో ఎదురయ్యే శారీరక మార్పుల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా గాయని జాస్మిన్ సాండ్లాస్ ఓ చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన ఓ భయంకరమైన క్షణాన్ని వివరించారు. మొదటిసారి రుతుక్రమం (పీరియడ్స్) వచ్చినప్పుడు అది ఒక సాధారణ శారీరక ప్రక్రియ అని తెలియక క్యాన్సర్ వచ్చిందని భ్రమపడి మృత్యువుకు దగ్గరయ్యానని భావించినట్లు వెల్లడించారు. ఈ ఘటన బాల్యంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు ఎంతటి మానసిక సంఘర్షణకు గురవుతారో తెలియజేస్తోంది.
జాస్మిన్ సాండ్లాస్ ఆందోళనను తల్లితో పంచుకోవడానికి కూడా చాలా సంకోచించానని చెప్పారు. ఆ సమయంలో కలిగిన భయం ఆమెను ఎంతలా వేధించిందంటే? తాను చనిపోతున్నానని భావించి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఓ వైపు శారీరక మార్పులు, మరోవైపు తెలియని భయం వెరసి చిన్న పిల్లల మనసుపై చూపే ప్రభావం ఎంతటి తీవ్రమైనదో ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో నేటికీ రుతుక్రమం వంటి అంశాలపై ఉన్న అపోహలు, బహిరంగంగా చర్చించుకోవడానికి ఉండే మొహమాటాలు చిన్న పిల్లల జీవితాల్లో ఇలాంటి భయాందోళనలకు కారణమవుతున్నాయన్నది పచ్చి వాస్తవం.
అమ్మాయిల పెరుగుదల దశలో ఎదురయ్యే ఇలాంటి మార్పుల గురించి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు ముందే అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకు భయం కలిగించేలా కాకుండా ఇది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ అని ధైర్యం చెప్పడం అవసరం. జాస్మిన్ అనుభవం చూస్తుంటే? ఇంట్లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని వాతావరణం లేదా తగినంత సమాచారం అందకపోవడం వల్ల పిల్లలు ఎంతటి ఊహాజనిత భయాల్లో బ్రతుకుతారో? అర్థ మవుతుంది. అపోహల కంటే వాస్తవాల గురించి తెలియజేయడమే కీలకం.
నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇలాంటి విషయాల గురించి చాలా ఓపెన్‌గా ఉంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో లేదా సంప్రదాయ కుటుంబాల్లో ఇంకా ఈ అంశం రహస్యంగానే మిగిలిపోతుంది. మారుతున్న కాలంతో పాటు విద్యాలయాల్లో , కుటుంబాల్లో లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన కనీస అవగాహనను పెంచడం ద్వారా ఇలాంటి అపోహలను తొలగించొచ్చు. జాస్మిన్ వంటి సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను ఇలా పంచుకోవడం ద్వారా సమాజంలో సానుకూల చర్చకు దారి తీసే అవకాశం ఉంటుంది.
అపోహలు, మూఢనమ్మకాలు లేని ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలంటే? మొదట ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. పిల్లలకు శారీరక మార్పులు సహజమని, అందులో భయపడాల్సిన పని లేదని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. జాస్మిన్ సాండ్లాస్ భయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం ద్వారా ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది యువతకు భరోసా ఇచ్చారు. పంచుకోవడమే సగం సమస్యకు పరిష్కారం అన్నట్లుగా మాట్లాడటం మొదలుపెడితే అపోహల ముసుగులు తొలగిపోతాయి.