బాల‌య్య - త‌మ‌న్ అన్ స్టాప‌బుల్ అంతే..!

అయితే బాల‌య్య కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డ‌టానికి, అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు త‌మ‌న్‌.;

Update: 2025-06-09 06:02 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మ‌ణిశ‌ర్మ‌ల క‌ల‌యిక‌లో సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌ణిశ‌ర్మ సంగీతంపై ఉన్న న‌మ్మ‌కంతో మ‌హేష్ త‌న సినిమాల‌కు త‌న‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కంటిన్యూ చేయ‌డం, అవి మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిల‌వ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని నంద‌మూరి బాల‌కృష్ణ ఫాలో అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. 'అఖండ‌' వ‌ర‌కు వ‌రుస ఫ్లాపులు చూసిన బాల‌కృష్ణ ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావ‌డం, అదే జోష్‌తో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్ట‌డం తెలిసిందే.

అయితే బాల‌య్య కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డ‌టానికి, అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు త‌మ‌న్‌. ఈ సినిమాకు త‌ను అందించిన బీజిఎమ్ వ‌ల్లే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి బాల‌య్య‌లో జోష్‌ని నింపింది అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తిలేదు. ఇందులో బాల‌య్య‌కు త‌మ‌న్ ఇచ్చిన ఎలివేష‌న్స్ థియేట‌ర్లు ద‌ద్దిరిల్లేలా చేసింది. ఓ ద‌శ‌లో త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కి థియేట‌ర్ల సౌండ్ సిస్ట‌మ్ రిపేర్ ద‌శ‌కు వెళ్లిందంటే త‌మ‌న్ ఏ స్థాయిలో పూన‌కాలు తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్‌ని 'అఖండ‌'కు అందించాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ విష‌యాన్ని బాల‌య్య గ్ర‌హించాడో ఏమో గానీ త‌న ప్ర‌తి సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది విడుద‌లైన `డాకు మ‌హారాజ్‌`కు కూడా త‌మ‌న్ సంగీతం అందించ‌డం తెలిసిందే. దీనికి త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం కూడా ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచి బాల‌య్య‌కు తిరుగులేని ఎలివేష‌న్‌ని అందించింది. సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. ఇలా త‌మ‌న్ కార‌ణంగా వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటున్న బాల‌య్య ఇప్పుడు కెరీర్ ప‌రంగా హైని చూస్తున్నారు.

'డాకు మ‌హారాజ్‌' త‌రువాత బాల‌య్య న‌టిస్తున్న మ‌రో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'అఖండ 2'. దీనికి కూడా త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌టం విశేషం. దీంతో ఈ సినిమాపై బాల‌య్య అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకుని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. బాల‌య్య ఇటీవ‌లే ఈ మూవీ కీల‌క షెడ్యూల్‌ని జార్జియాలో పూర్తి చేశాడు. డివోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీని బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని సెప్టెంబ‌ర్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బాల‌కృష్ణ తాజాగా మ‌రో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేయ‌నున్న ఈ మూవీకి కూడా త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌టంతో బాల‌య్య - త‌మ‌న్‌ల కాంబినేష‌న్ అన్ స్టాప‌బుల్ అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. టీమ్ త‌మ‌న్ పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఈ మూవీకి త‌మ‌నే సంగీతం అందించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ గోపీచంద్‌, బాల‌కృష్ణ ప్రాజెక్ట్‌కు సోష‌ల్ మీడియా వేదిగిక‌గా త‌మ‌న్‌ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. దీనికి 'లెట్స్ రాక్‌' అంటూ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని రిప్లై ఇవ్వ‌డంతో ఈ ప్రాజెక్ట్ కోసం త‌మ‌న్ కూడా వ‌ర్క్ చేయ‌బోతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌టంతో బాల‌య్య అభిమానులు పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. తాజాగా ఈ రెండు ప్రాజెక్ట్‌ల‌తో త‌మ‌న్‌, బాల‌య్య‌ కాంబినేష‌న్ డ‌బుల్ హ్యాట్రిక్‌ని ద‌క్కించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News