ఇండస్టీలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం: చిరు
తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) మరో కీలక ముందడుగు వేసింది.;
తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) మరో కీలక ముందడుగు వేసింది. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది- ఉగాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ పథకాలను అమలు చేయడం ఆ సంస్థ ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, ఇన్సూరెన్స్ రెన్యువల్, ఐడీ కార్డుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. TFJA డైరీ, ఇన్సూరెన్స్ పథకం, ఐడీ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సినిమా రంగానికి అద్దం పట్టే వారని తెలిపారు. వారి సంక్షేమం కోసం TFJA తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు.
ఈ ఏడాది TFJA ఇన్సూరెన్స్ పథకంలో ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో ప్రతి ఫిల్మ్ జర్నలిస్టు కుటుంబానికి (2+2) అందించిన రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీని, ఈసారి రూ.10 లక్షలకు పెంచడం విశేషం. ఇది జర్నలిస్టుల కుటుంబాలకు మరింత భద్రతను కల్పించే నిర్ణయమని చెప్పాలి. అదేవిధంగా, ప్రమాదాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే జర్నలిస్టులను ఆదుకునేందుకు యాక్సిడెంట్ పాలసీని కూడా ప్రవేశపెట్టారు.
ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలల వరకు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో.. ప్రతి వారం రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ చర్య జర్నలిస్టులకు కీలక భరోసా ఇవ్వనుందని TFJA ప్రతినిధులు తెలిపారు. ఇక జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే దిశగా TFJA మరో అడుగు ముందుకు వేసింది.
అసోసియేషన్ తరఫున ప్రత్యేక ఐడీ కార్డులను జారీ చేయగా, వాటిని చిరంజీవి తాజాగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆ ఐడీ కార్డులు జర్నలిస్టులకు అధికారిక గుర్తింపును ఇవ్వడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి TFJA కార్యక్రమాలను అభినందిస్తూ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని ఆయన సూచించారు.
సినీ పరిశ్రమలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి భద్రత, సంక్షేమం కోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. మొత్తానికి.. TFJA చేపట్టిన చర్యలు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమానికి మరింత బలం చేకూర్చనున్నాయి. ఇన్సూరెన్స్ కవరేజీ పెంపు, యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా కల్పించే అడుగులుగా నిలుస్తాయని అంతా అభిప్రాయపడుతున్నారు.