థియేటర్లు ఎందుకు దొరకడం లేదు? తమిళ ప్రేక్షకుల పల్స్ మిస్ అవుతున్నామా?

తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగులో ఎందుకు ఆడుతున్నాయంటే, ఇక్కడి లిరిక్ రైటర్లు పాటలను తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా మారుస్తారు.

Update: 2026-07-17 06:38 GMT

తమిళనాట తెలుగు సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే ఆవేదన వెనుక ఒక చేదు నిజం దాగుంది. తమిళ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అక్కడి ప్రేక్షకులు మన డబ్బింగ్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరత కాదు, మన సినిమాల అనువాదంలో జరుగుతున్న పొరపాట్లు. తమిళ ప్రేక్షకుల సంస్కృతిని, వారి భాషా శైలిని పట్టుకోవడంలో మన మార్కెటింగ్, రైటింగ్ టీమ్స్ విఫలమవుతున్నాయనే కొత్త వాదన వినిపిస్తుంది..

గూగుల్ ట్రాన్స్‌లేషన్ లాంటి డైలాగులు:

కోలీవుడ్ నుండి టాలీవుడ్‌కి వచ్చే సినిమాలు ఇక్కడి నేటివిటీకి అద్దం పడతాయి. కానీ మన తెలుగు సినిమాలు తమిళంలోకి వెళ్లేటప్పుడు కేవలం మాటలను ఒక భాష నుండి మరో భాషలోకి మార్చినట్టు ఉంటున్నాయే తప్ప, వారి మనసులను తాకడం లేదు. తమిళ ప్రేక్షకులు భాషాభిమానం ఎక్కువ ఉన్నవాళ్లు. వారికి సినిమా చూస్తున్నప్పుడు అది తమ సొంత సినిమా అనే ఫీలింగ్ కలగకపోతే అస్సలు ఆదరించరు. మన రైటర్స్ అక్కడ కేవలం పదాలను మారుస్తున్నారు కానీ, భావాన్ని మార్చలేకపోతున్నారు.

మిస్ అవుతున్న తమిళ నేటివిటీ, పాటల ప్రాణం:

తమిళంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగులో ఎందుకు ఆడుతున్నాయంటే, ఇక్కడి లిరిక్ రైటర్లు పాటలను తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా మారుస్తారు. కానీ మన తెలుగు పాటలు తమిళంలోకి వెళ్లేసరికి కేవలం డబ్బింగ్ పాటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇక తమిళ ప్రేక్షకుల పల్స్, వారి రోజువారీ సామెతలు, హాస్యం వేరుగా ఉంటాయి. వాటిని స్టడీ చేయకుండా కేవలం సినిమాను అక్కడ రిలీజ్ చేస్తే థియేటర్లు ఖాళీగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

కంటెంట్ క్వాలిటీ లోపాలే పెద్ద శాపం:

ఇక "బాహుబలి", "పుష్ప" లాంటి సినిమాలు తమిళనాట ఆడటానికి కారణం వాటిలోని సార్వత్రికమైన ఎమోషన్స్ మరియు అక్కడి మార్కెట్‌పై ప్రత్యేకంగా పెట్టిన శ్రద్ధ. కానీ మిగతా మీడియం బడ్జెట్ సినిమాల విషయంలో మన మేకర్స్ కేవలం ఫార్మాలిటీ కోసం డబ్బింగ్ చెప్తున్నారు. ఇక కంటెంట్ అనువాదంలో వస్తున్న క్వాలిటీ లోపాల వల్లే తమిళ డిస్ట్రిబ్యూటర్లు మన సినిమాలు కొనడానికి, థియేటర్లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు.

తమిళనాడులో మన సినిమాలకు మార్కెట్ పెరగాలంటే కేవలం థియేటర్లు కావాలని అడగడం సరిపోదు. తమిళ ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకుని, వారి సంస్కృతికి తగినట్టుగా రీ-రైటింగ్, డబ్బింగ్ క్వాలిటీని పెంచాలి. ఎప్పుడైతే మన సినిమా వాళ్లకు డబ్బింగ్ చిత్రంలా కాకుండా ఒక స్ట్రెయిట్ తమిళ సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తుందో, అప్పుడు థియేటర్లు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి.

Tags:    

Similar News