థియేటర్ల నిర్వహణలో సంక్షోభం: దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు!
ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం పరిశ్రమను కలవరపెడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం పరిశ్రమను కలవరపెడుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న `అద్దె విధానం` వల్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇకపై కేవలం `పర్సంటేజీ షేరింగ్` మోడల్‌లోనే సినిమాలు ఆడించాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధానం అమలులో ఉండాలనేది నేడు జరగనున్న సినీ పెద్దల సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం టాలీవుడ్ భవిష్యత్తును శాసించనుంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇటీవలే సుదీర్ఘ చర్చలు జరిగాయి. శాండల్‌వుడ్‌లో గతంలో ఫిక్స్‌డ్ రెంటల్ సిస్టమ్ బలంగా ఉండేది.. కానీ చిన్న సినిమాల నిర్మాతలు - థియేటర్ యజమానుల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో వచ్చిన విభేదాల వల్ల మార్పులు చోటుచేసుకున్నాయి. కర్ణాటక ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అద్దె విధానం ఉన్నప్పటికీ మెజారిటీ మల్టీప్లెక్స్‌లు - సిటీ థియేటర్లు ఇప్పుడు `రెవెన్యూ షేరింగ్` (పర్సంటేజీ) వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది సినిమాల బాక్సాఫీస్ రన్ ఆధారంగా పారదర్శకంగా సాగుతోంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ దిగ్గజ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ షేరింగ్ పేరుతో మొత్తం వ్యవస్థపై గుత్థాధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. అయితే వ్యవస్థ ఒకరి చేతిలోకి వెళ్లిపోకుండా ఆపేందుకు ఏం చేస్తారనేది కూడా పర్సంటేజీ విధానాన్ని అమలు చేసే పెద్దలు నేటి సమావేశంలో ముందే నిర్ణయించాల్సి ఉంటుంది.
తమిళనాడు (కోలీవుడ్) విషయానికి వస్తే... అక్కడ థియేటర్ల వ్యవస్థ చాలా పక్కాగా ఉంటుంది. తమిళనాడు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ చాలా శక్తివంతమైనది. అక్కడ చాలా ఏళ్ల క్రితమే అద్దె విధానం నుండి పర్సంటేజీ షేరింగ్ విధానానికి మార్పు జరిగింది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలకు మొదటి వారం, రెండో వారం ఇలా వారాల వారీగా పర్సంటేజీ మారుతూ ఉంటుంది (ఉదాహరణకు మొదటి వారం 60/40 నిష్పత్తిలో ఉంటుంది). అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని చిన్న థియేటర్లు ఇప్పటికీ లీజు లేదా అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. అయితే తమిళనాడులో సందర్భానుసారం రెండు మోడల్స్ అమల్లో ఉన్నాయి.
ఉత్తరాదిన బాలీవుడ్ మార్కెట్ పనితీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లు (పీవీఆర్, ఐనాక్స్ వంటివి) ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ పూర్తిగా `రెవెన్యూ షేరింగ్` మోడలే అమల్లో ఉంది. మల్టీప్లెక్స్‌లలో మొదటి వారం 50 శాతం, రెండో వారం 42 శాతం ఇలా ముందే ఖరారు చేసిన పర్సంటేజీల ప్రకారం వాటాలు పంచుకుంటారు. సింగిల్ స్క్రీన్ల విషయంలో కూడా ఉత్తరాది ఎగ్జిబిటర్ల అసోసియేషన్లు అద్దె కంటే వాటాల పంపిణీకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎగ్జిబిటర్లు పూర్తిగా మునిగిపోకుండా కొంత రక్షణ లభిస్తోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ రాష్ట్రాల ధోరణిని గమనిస్తే... కాలక్రమేణా అందరూ స్థిరమైన అద్దె కంటే పారదర్శకమైన పర్సంటేజీ విధానం వైపే అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అద్దె విధానంలో నిర్మాతకు భారం తగ్గినా ఎగ్జిబిటర్లు నష్టపోవడం లేదా రివర్స్‌లో జరిగే ప్రమాదం ఉంది. కానీ పర్సంటేజీ విధానంలో సినిమా విజయంతో ఇద్దరి ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పూర్తిగా పర్సంటేజీ విధానం లేదా పూర్తిగా అద్దె విధానం కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ థియేటర్ల పరిస్థితులను అనుసరించి ఒక మధ్యే మార్గం ఏదైనా కనుగొంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా పర్సంటేజీ షేరింగ్ విధానంలో కేవలం కొందరు టాప్ ఎగ్జిబిటర్స్ థియేటర్లపై గుత్థాధిపత్యం చెలాయిస్తే అది సహించలేనిది. ఈ ప్రమాదం దృష్ట్యా నిర్మాతలు వ్యతిరేకిస్తున్న వైనాన్ని కూడా నేటి సమీక్షా సమావేశంలో సినీపెద్దలు విశ్లేషించాల్సి ఉంటుంది.
సినిమా ప్రదర్శన రంగంలో వస్తున్న ఈ మార్పులు డిజిటల్ యుగంలో అనివార్యం. కేవలం అద్దె వసూలు చేయడం కంటే.. టికెట్ అమ్మకాలలో పారదర్శకత పెంచి... ప్రతి రూపాయిని పంచుకోవడం వల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ - ఎగ్జిబిటర్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. టాలీవుడ్ లో నేటి సినీపెద్దల సమావేశం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కూడా పొరుగు రాష్ట్రాల బాటలోనే పర్సంటేజీ షేరింగ్ విధానాన్ని .. అద్దె విధానాన్ని కూడా పరిశీలించి ఇక్కడి పరిస్థితులకు అన్వయిస్తారనే భావిస్తున్నారు. అయితే అద్దె విధానం లేదా పర్సంటేజీ విధానం ఏదైనా ఇందులో ప్రభుత్వాల నిర్వహణా జోక్యం ఎంతవరకూ అవసరం అనేది పరిశ్రమ నిర్ణయించాల్సి ఉంటుంది.