తెలుగు దర్శకులు సక్సెస్.. తమిళ దర్శకులు ఫెయిల్.. ఇది ట్రాక్ రికార్డ్!

అవి కూడా మామూలు ఫ్లాప్స్ కాదు. మన హీరోల కెరీర్ లో దారుణమైన డిజాస్టర్స్. ఒకసారి ఆ కాంబినేషన్స్ పై ఓ లుక్కేస్తే..;

Update: 2025-06-21 12:09 GMT

ఇటీవలి కాలంలో తెలుగు దర్శకులు తమిళ హీరోలతో చేసిన సినిమాలు మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. కానీ తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేసిన సినిమాలు మాత్రం ఒక్కటి కూడా మనకు నచ్చేలా లేకుండా డిజాస్టర్‌గా మిగిలాయి. తెలుగు దర్శకులు అద్భుతంగా ప్లాన్ చేస్తే, తమిళ దర్శకులు మాత్రం తెలుగులో నేటివిటీ పట్టించుకోకుండా తడబడినట్టే కనిపిస్తోంది. అవి కూడా మామూలు ఫ్లాప్స్ కాదు. మన హీరోల కెరీర్ లో దారుణమైన డిజాస్టర్స్. ఒకసారి ఆ కాంబినేషన్స్ పై ఓ లుక్కేస్తే..

సర్/వాథి – ధనుష్‌కు కెరీర్ బెస్ట్ హిట్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల నేపథ్యంలో సాగిన ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే ఒక గొప్ప విజయం. ఎమోషన్, కమర్షియల్ అంశాలు సమపాళ్లలో ఉండటం సినిమాను విజయవంతం చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్లకు పైనే రాబట్టింది.

లక్కీ భాస్కర్ – దుల్కర్‌కు పెద్ద హిట్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్యాంకింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ టచ్‌తో తెరకెక్కింది. దుల్కర్ నటనతో పాటు స్ర్టాంగ్ స్క్రీన్‌ప్లే సినిమాను హిట్‌గా నిలిపింది. తెలుగు మార్కెట్‌లో దుల్కర్‌కు ఇది మరో పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. అప్పటివరకు అతనికి ఇలాంటి హిట్టు పడలేదు. ఇది కూడా వంద కోట్లు తెచ్చి పెట్టిన సినిమా.

కుబేరా – ధనుష్-కమ్ముల మ్యాజిక్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా థ్రిల్లర్ మంచి వసూళ్లు సాధిస్తోంది. 3 గంటల 15 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, స్టార్స్ పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టాయి. మొదటి రోజే ధనుష్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందించిన సినిమా కావడం విశేషం. అలాగే ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫెమెన్స్ స్టోరీ అనే టాక్ వస్తోంది.

ఊపిరి -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మల్టీస్టారర్ ఎమోషనల్‌గా ఇద్దరు మనుషుల మధ్య మంచి బంధాన్ని చూపించింది. నాగార్జున పాత్ర ప్రేక్షకులను కదిలించగా, కార్తి నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రెండు భాషల్లోనూ హిట్ అయ్యింది. అలాగే కార్తీకి తెలుగులో మరింత క్రేజ్ ను అందించింది.

వరిసు – విజయ్‌కు ఫ్యామిలీ హిట్

వంశీ పైడిపల్లి తమిళ స్టార్ విజయ్‌తో తీసిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా రూపొందింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. తెలుగు టచ్ ఉన్న కథను తమిళ ప్రేక్షకులు కూడా స్వాగతించారు. దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించిన విధానం కూడా సినిమాకు ప్లస్ పాయింట్.

ఇక తమిళ దర్శకుల విషయానికి వస్తే..

స్పైడర్ – మురుగదాస్ ఫెయిల్యూర్

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. కథలో బలమైన కంటెంట్ లేకపోవడం, బలమైన ఎమోషన్ లేకపోవడం సినిమాను బలహీనంగా నిలిపింది. తమిళంలో తుపాకీ, గజిని లాంటి సినిమాలు ఇచ్చిన అతను మహేష్ కు ఇలాంటి దారుణమైన ఫ్లాప్స్ ఇస్తారు అని ఎవరు ఊహించలేదు.

ది వారియర్ – రామ్‌కు నిరాశ

పందేకోడి ఫేమ్ లింగుసామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్‌కు అనుకోని పరాజయం. కథ పాత ఫార్మాట్‌లో ఉండడం, ప్రాసెస్ బలహీనంగా ఉండటం సినిమాను డౌన్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ తోహిట్టు కొట్టి ట్రాక్ లోకి వచ్చిన రామ్ కు ఈ సినిమా బిగ్ షాక్ ఇచ్చింది.

కస్టడీ - చైతూతో వెంకట్ ప్రభు ప్రయత్నం విఫలం

మానాడు దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా కథనం బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టలేకపోయింది. నాగచైతన్య ప్రాణం పెట్టి నటించినా కూడా ఫలితం దక్కలేదు. రెండు భాషల్లో ఫెయిల్ అయింది. బాక్సాఫీస్ వద్ద కనీసం సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు.

గేమ్ చేంజర్ - భారీ బడ్జెట్ డిజాస్టర్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా టెక్నికల్‌గా గ్రాండ్‌గా ఉన్నా, కథ బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. భారీగా హైప్ ఉన్నా ఫలితం మాత్రం ఫ్లాప్. దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను కలిగించింది. శంకర్ గత సినిమాలన్నీ కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. కానీ తెలుగు హీరోతో మాత్రం ఆయన సరైన హిట్ ఇవ్వలేకపోయారు.

Tags:    

Similar News