సినిమా టికెట్‌ ధరల పెంపు: ఎగ్జిబిటర్లకు లాభమా? నష్టమా?

ప్రస్తుత ఓటీటీ, డిజిటల్ యుగంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయిందనేది ఎగ్జిబిటర్లు, సినీప్ర‌ముఖుల‌కు స్పష్టంగా తెలిసిన‌ నిజం.

Update: 2026-08-20 03:40 GMT

ప్రస్తుత ఓటీటీ, డిజిటల్ యుగంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయిందనేది ఎగ్జిబిటర్లు, సినీప్ర‌ముఖుల‌కు స్పష్టంగా తెలిసిన‌ నిజం. హాలీవుడ్ స్థాయి విజువల్స్ లేదా అసాధారణమైన కంటెంట్ ఉన్న పెద్ద సినిమాలకు, అలాగే చిన్న బడ్జెట్ చిత్రాల్లో అద్భుతమైన ఎలిమెంట్ ఏదైనా ఉంటేనే జనం థియేటర్ల వైపు చూస్తున్నారు. అధిక టికెట్ ధరలు, థియేటర్లలో పదార్థాల (కూల్ డ్రింక్స్, తినుబండారాల) భారం కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్లలోనే టీవీ సీరియళ్లు, ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) విజ్ఞప్తుల మేరకు హోం శాఖ నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు డిసెంబర్ 2021 నాటి పాత నిబంధనల స్థానంలో కొత్త ధరలను నిర్ణయించింది.

నూతన ధరల విధానం ప్రకారం.. థియేటర్ల రకాలను బట్టి తెలంగాణ‌లో రేట్లలో మార్పులు వచ్చాయి. సాధారణ నాన్-ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ. 30 నుండి రూ. 70 వరకు, ఏసీ థియేటర్లలో రూ. 50 నుండి రూ. 150 వరకు నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌లలోని లగ్జరీ రీక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ. 300 వరకు వసూలు చేసుకునే వీలు కల్పించారు. అలాగే 7.1 సరౌండ్ సౌండ్, 2కే, 4కే ప్రొజెక్షన్ వంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలున్న సింగిల్ స్క్రీన్లను `స్పెషల్ థియేటర్లు`గా గుర్తించి... వాటికి మల్టీప్లెక్స్‌లతో సమానంగా ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఇచ్చారు. అదనంగా ఎయిర్-కూల్డ్ థియేటర్లను ఏసీ విభాగంలో విలీనం చేస్తూ పూర్తిస్థాయి ఏసీగా మారడానికి రెండేళ్ల సమయం ఇచ్చారు. లేని పక్షంలో వాటిని నాన్-ఏసీగానే పరిగణిస్తారు.

టికెట్ ధరలతో పాటు సామాన్యులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను పొందుపరిచింది. థియేటర్ ఏ వర్గానికి చెందినదైనా పేద -మధ్యతరగతి ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా మొత్తం సీట్లలో 25 శాతాన్ని నాన్-ప్రీమియం సీట్లుగా తప్పనిసరిగా రిజర్వ్ చేయాలని ఆదేశించింది. నిర్ణయించిన ఈ టికెట్ ధరలకు జిఎస్‌టి - ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. అయితే థియేటర్ల నిర్వహణ ఖర్చుల కింద ఏసీ థియేటర్లలో రూ. 5, నాన్-ఏసీ థియేటర్లలో రూ. 3 చొప్పున టికెట్ ధరలోనే కలిపి వసూలు చేసుకోవడానికి అనుమతించారు.

నిర్మాతల కోరిక మేరకు ప్రభుత్వం ధరలను పెంచినా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు - ఉద్యోగ అస్థిరతల నడుమ సామాన్యుడు టికెట్ పెంపును ఎలా స్వీకరిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రౌండ్ రియాలిటీని పరిశీలించకుండా కేవలం నిర్మాతల ప్రయోజనాల కోసమే ధరలు పెంచితే ధరల షాక్‌తో జనాలు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేస్తే తీవ్రంగా నష్టపోయేది ఎగ్జిబిటర్లే. ఈ ధరల పెంపు ఎగ్జిబిటర్ల వ్యవస్థకు ప్రాణవాయువుగా మారుతుందా లేదా వారిని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందా అనేది రాబోయే 6 నెలల ఆదాయ వ్యయాల పట్టిక వస్తే గానీ స్పష్టత రాదు.

సాంకేతిక మార్పులు - ప్రేక్షకుల ప్రాధాన్యతలు మారుతున్న తరుణంలో ప్రభుత్వాల నిర్ణయాలు థియేటర్ వ్యవస్థ మనుగడను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News