టికెట్ ధరలు.. ఇకపై రిక్వెస్ట్ చేయొద్దు: కోమటిరెడ్డి

అటు ఎన్నికల ప్రచారం, గ్లోబల్ సమ్మిట్ డిబేట్స్ తో బిజీగా ఉన్నా. నా దృష్టిలో లేకుండా ఇటీవల ఆర్డర్ ఇచ్చారు. అనుమతులు జారీ చేశారు" అని అఖండ 2 కోసం తెలిపారు.;

Update: 2025-12-12 12:15 GMT

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచే అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు.. సినిమా నిర్మాతలు, దర్శకులు టికెట్‌ ధరలు పెంచమని తమ వద్దకు రావొద్దని తెలిపారు.

"పుష్ప-2 సమయంలోనే ఇకపై టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలో చెప్పాం. సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించినది. ఇష్టం ఉన్నట్లు రేట్లు పెంచుతున్నారు. ప్రస్తుతం ఏ సినిమా వచ్చినా.. కుర్రాళ్లు కచ్చితంగా చూడాలని అనుకుంటున్నారు. సినిమాలకు నెల జీతం పోతుంది" అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇప్పటికే హోంశాఖ సెక్రటరీ గారు.. సార్ కొన్ని సినిమాలకు మినహాయింపు ఇవ్వొచ్చని ప్రజలు చెప్పినట్లు తెలిపారు. నేను కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాను. అందుబాటులో లేను. అటు ఎన్నికల ప్రచారం, గ్లోబల్ సమ్మిట్ డిబేట్స్ తో బిజీగా ఉన్నా. నా దృష్టిలో లేకుండా ఇటీవల ఆర్డర్ ఇచ్చారు. అనుమతులు జారీ చేశారు" అని అఖండ 2 కోసం తెలిపారు.

"హైకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం ఇటీవల అనుమతులు ఇచ్చాం. అయినా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా.. సంబంధిత శాఖ మంత్రిగా ఇకపై ఎవరూ కూడా మాకు రిక్వెస్ట్ చేయొద్దని కోరుతున్నా. దయచేసి రేట్లు పెంచమని మా దగ్గరకు రావద్దు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించి.. భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు ఇవ్వం" అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

"నిజానికి అనుమతులు ఇవ్వమని అనుకున్నాం. ఇప్పుడు జరిగిన పొరపాటును గ్రహించాం. హైకోర్టు కొన్నిసార్లు మినహాయింపు ఇవ్వొచ్చని చెప్పింది. దాని ప్రకారం ఇచ్చినా హైకోర్టు తప్పుపట్టింది. అందుకే ఇకపై ఆ ప్రసక్తే ఉండదు. పెద్ద సినిమాకు ఎక్కువ బడ్జెట్ ఎవరు పెట్టమన్నారు.. హీరోకు కోట్లలో ఎవరిమన్నారు?" అని ప్రశ్నించారు.

"రేట్లు పెంచితే పేదవాళ్లు సినిమాలు ఎలా చూస్తారు.. పిల్లలేమో సినిమాలు చూడాలని అంటారు.. థియేటర్స్ కు వెళ్తే అన్నీ కావాలని అంటారు.. కానీ అంత రేట్లు ఉంటే ఎలా.. ఇది పేదల ప్రభుత్వం కాబట్టి ఇకపై అనుమతులు ఇవ్వం.. రేట్లపై ఎలాంటి పాలసీ తీసుకురాం. భవిష్యత్తులో ఎలాంటి అనుమతి ఇవ్వం" అని తేల్చిచెప్పారు.

అయితే అఖండ 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేట్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చి జీవో జారీ చేసింది ప్రభుత్వం. దీంతో హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా.. సర్కార్ ఇచ్చిన జీవోను కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ స్టే విధించింది. అలా ప్రతిసారి అదే సీన్ రిపీట్ అవుతుండటంతో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News