షాకింగ్: త‌న స‌హాయ‌కుల‌కు గాయ‌ని బోన‌స్ 1787కోట్లు!

సంక్రాంతి పండ‌క్కి బోన‌స్ అడిగితే కంపెనీ న‌ష్టాల్లో ఉంద‌ని దాట వేస్తారు. కానీ ఈ ప్ర‌ముఖ గాయ‌ని అడ‌గ‌కుండానే త‌న స‌హాయ‌కుల‌కు క‌ళ్లు చెదిరే బోన‌స్ అందజేసింది.;

Update: 2025-12-15 17:00 GMT

సంక్రాంతి పండ‌క్కి బోన‌స్ అడిగితే కంపెనీ న‌ష్టాల్లో ఉంద‌ని దాట వేస్తారు. కానీ ఈ ప్ర‌ముఖ గాయ‌ని అడ‌గ‌కుండానే త‌న స‌హాయ‌కుల‌కు క‌ళ్లు చెదిరే బోన‌స్ అందజేసింది. అది కూడా ట్రక్ డ్రైవ‌ర్లు, వంట చేసేవాళ్లు, మేక‌ప్ ఆర్టిస్టులు, త‌న‌తో ప‌ని చేసిన సాటి క‌ళాకారులందరికీ ఏకమొత్తంగా రూ.1787 కోట్ల (197 మిలియ‌న్ డాల‌ర్లు) బోన‌స్ అందించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో త‌న స‌హాయ‌కుల‌కు ఈ రేంజు బోన‌స్ అందించ‌డం అనేది ఇదే తొలిసారి.

అంత గొప్ప హృద‌యం ఉన్న ఆ గాయ‌ని ఎవ‌రో తెలుసుకోవాల‌నుందా? క‌చ్ఛితంగా అది పాప్ సెన్సేష‌న్ టేల‌ర్ స్విఫ్ట్. దాన‌ధ‌ర్మాల్లో ముందుంటే ఈ ప్ర‌ముఖ గాయ‌ని హృద‌యం ఎంత గొప్ప‌దో ఇప్పుడు మ‌రోసారి నిరూప‌ణ అయింది. డిసెంబర్ 13న తన 36వ పుట్టినరోజు జ‌రుపుకున్న పాప్ సూపర్ స్టార్ టేల‌ర్ స్విఫ్ట్ గత రెండు సంవత్సరాలుగా తన ఎరాస్ టూర్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ న‌గ‌దు బహుమతిని ఇచ్చారు. ఈ అద్భుతమైన క్షణాన్ని ఆమె డాక్యుమెంటరీలు `ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా`లో బంధించారు. అస‌లు దీనిని న‌మ్మ‌లేము అన్న‌ట్టుగా టేల‌ర్ స్విఫ్ట్ సిబ్బంది పూర్తి అయోమ‌యంలో ఉండిపోయారు. కొంద‌రు ఎమోష‌న్ త‌ట్టుకోలేక ఏడ్చేసారు. మ‌రికొంద‌రు ఒక చోట గుమిగూడి ఈ ఆనందక‌ర క్ష‌ణాన్ని ఎంతో ఎమోష‌న‌ల్ గా ఒక‌రితో ఒక‌రు షేర్ చేసుకున్నారు.

2023 ఆగస్టులో ముగిసిన ఉత్తర అమెరికా పర్యటన మొదటి దశలో ఈ ధాతృత్వం ప్రారంభమైంది. మొద‌టి ద‌ఫా స్విఫ్ట్ 55 మిలియన్ల డాల‌ర్ల‌కు పైగా బోనస్‌లను అందజేసింది. డిసెంబర్ 2024లో వాంకోవర్‌లో పర్యటన ముగిసే సమయానికి, మొత్తం 197 మిలియన్ల డాల‌ర్ల‌కు ఈ ధాతృత్వ సేవ‌ చేరుకుంది. త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి టీమ్ స‌భ్యునికి ఈ బోన‌స్ అందింది. డ్యాన్స‌ర్లు, కొరియోగ్రాఫ‌ర్లు, బ్యాండ్ కోసం ప‌ని చేసే ట్రక్ డ్రైవర్లు, క్యాటరర్లు, సెక్యూరిటీ, లైటింగ్ అండ్ సౌండ్ సిబ్బంది, వార్డ్‌రోబ్, హెయిర్, మేకప్, ఫిజికల్ థెరపిస్ట్‌లు, వీడియోగ్రాఫ‌ర్ల వరకు అంద‌రికీ బోన‌స్ లు అందాయి.

డాక్యు సిరీస్ లో స్విఫ్ట్ ఇలా తాను బోన‌స్ ఇవ్వ‌డం ఎంత ముఖ్య‌మైన‌దో వివ‌రించింది. రోజంతా రోడ్ పై ప‌ని చేసే త‌న‌వారికి ఈ బోనస్ డే చాలా ముఖ్యమైనది. టూర్ ఎక్కువ వసూళ్లు చేస్తే వారికి ఎక్కువ బోనస్ లభిస్తుంది. వీరంతా చాలా కష్టపడి పనిచేస్తారు.. నా ప‌రివార‌మంతా ది బెస్ట్! అని అన్నారు.

`ఎరాస్ టూర్` నిజానికి వ‌సూళ్ల ప‌రంగా చరిత్ర సృష్టించింది. ఈ టూర్ 2 బిలియన్ల డాల‌ర్లు పైగా వసూలు చేసిన మొదటి టూర్‌గా నిలిచింది. ఇది 21 దేశాలు, ఐదు ఖండాల్లోని 53 నగరాల్లో 149 ప్రదర్శనలను నిర్వహించారు. కేవ‌లం సరుకులు (మ‌ర్కండైల్) మాత్ర‌మే దాదాపు 400 మిలియన్ డాల‌ర్లు తెచ్చిపెట్టాయి. ఇది టూర్ స్థాయిని మ‌రింత‌ పెంచింది.



Tags:    

Similar News