హీరోలకో న్యాయం.. హీరోయిన్లకో న్యాయమా?

తాప్సీ కామెంట్స్ కేవలం వయసు అంశానికే పరిమితం కాలేదు. సౌత్ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన పరిస్థితులను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు.

Update: 2026-06-08 06:44 GMT

సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు వర్తించే ప్రమాణాలు ఒకేలా ఉన్నాయా? వయసు పెరిగే కొద్దీ అవకాశాల విషయంలో ఇద్దరికీ సమానమైన అవకాశాలు లభిస్తున్నాయా? అనే ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దీనికి కారణం నటి తాప్సీ పన్ను చేసిన తాజా వ్యాఖ్యలే. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ, ముఖ్యంగా హీరోయిన్ల‌పై ఇండస్ట్రీలో ఉన్న ఏజ్ లిమిట్ ను ఆమె బహిరంగంగా ప్రశ్నించారు. 30 ఏళ్లు దాటిన హీరోయిన్ రొమాంటిక్ కామెడీ సినిమాల‌కు సరిపోదంటారు. కానీ 50, 60 ఏళ్లు దాటిన హీరోలు మాత్రం ల‌వ్ స్టోరీల్లో నటిస్తుంటారు. ఈ రూల్స్ హీరోయిన్లకే ఎందుకు వర్తిస్తున్నాయంటూ ఆమె సంధించిన ప్రశ్న ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

తాప్సీ కామెంట్స్ కేవలం వయసు అంశానికే పరిమితం కాలేదు. సౌత్ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన పరిస్థితులను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. సీనియర్ హీరోల సరసన నటించిన తర్వాత, యంగ్ హీరోలు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనకడుగు వేసేవారని ఆమె పేర్కొన్నారు. దీంతో కొన్ని అవకాశాలు కోల్పోయానని వెల్లడించారు. ఒక హీరోయిన్ సీనియర్ హీరోతో సినిమా చేస్తే ఆమె ఇమేజ్‌ను ఒక విధంగా చూసే పరిస్థితి సౌత్‌లో ఉందని, అదే సమయంలో బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోలతో నటించడం హీరోయిన్ కెరీర్‌కు మరింత ప్లస్ అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ల కెరీర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్తుందని, కానీ సౌత్‌లో అలాంటి దృక్పథం కనిపించదని ఆమె విశ్లేషించారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ వ్యవధిపై కూడా తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 20 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి వచ్చానని, ఒక నటిగా గుర్తింపు పొందడానికి మూడు నుంచి నాలుగేళ్ల టైమ్ పట్టిందని చెప్పారు. కెరీర్ పరంగా సెటిల‌య్యే టైమ్ కు 30 ఏళ్లు వచ్చేశాయని, అప్పుడే కొందరు ఇలాంటి పాత్రలకు మీరు చాలా పెద్దవారవుతార‌ని చెప్పడం ప్రారంభించారని ఆమె వెల్లడించారు. కథకు, పాత్రకు వయసుతో సంబంధం లేకపోయినా, కేవలం హీరోయిన్ వయసునే ప్రమాణంగా తీసుకుని అవకాశాలను నిరాకరించడం బాధాకరమని అన్నారు. ఇదే పరిస్థితి హీరోల విషయంలో కనిపించదని, అందుకే ఈ డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రశ్నలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఏజిజం, జెండర్ బ‌యాస్ అంశాలపై మరోసారి చర్చకు తెరతీశాయి. గతంలో కూడా పలువురు నటీమణులు ఇలాంటి అనుభవాలను పంచుకున్నప్పటికీ, తాప్సీ నేరుగా హీరోలు- హీరోయిన్ల మధ్య ఉన్న అసమానతను ప్రస్తావించడం విశేషం. వయసు కంటే టాలెంట్, యాక్టింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవైపు సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెబుతూనే, మరోవైపు హీరోయిన్‌ల వయసును అడ్డంకిగా చూపించడం విరుద్ధమైన పరిస్థితి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాప్సీ లేవనెత్తిన ప్రశ్నలకు ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News