90స్ లో బాలీవుడ్ పరిస్థితులపై సుస్మితా ఏమంటుందంటే
రీసెంట్ గా INWEC ఈవెంట్ లో భాగంగా సుస్మితా సేన్ తన బాలీవుడ్ ప్రయాణం గురించి మాట్లాడుతూ 90స్ లో ఎంతోమంది హీరోయిన్లు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు.;
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత ఫేమ్, స్టార్ స్టేటస్, లైఫ్ టైమ్ హీరోయిన్లకు ఉండదనేది వాస్తవం. హీరోయిన్లకు ఎంత ఫేమ్ ఉన్నా అది కొంతకాలం వరకే. స్టార్‌డమ్ ఉన్నంత వరకు వెంటపడే మీడియా, దర్శకనిర్మాతలు అదే స్టార్‌డమ్ పోయాక మాత్రం వారిని లైట్ తీసుకుంటారు. దీని వల్ల హీరోయిన్లు తమకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకోవడం చాలా కష్టమవుతుంది.
అంతేకాదు, హీరోలకు ఇచ్చినట్టు డైరెక్టర్లు హీరోయిన్లకు పవర్‌ఫుల్ పాత్రలు ఇవ్వకుండా ఎప్పుడూ ఒకే మూస పద్ధతిలో వారి క్యారెక్టర్లు ఉండటంతో హీరోయిన్లు అంత ఎక్కువగా ఫేమస్ అవలేరు. రీసెంట్ గా INWEC ఈవెంట్ లో భాగంగా సుస్మితా సేన్ తన బాలీవుడ్ ప్రయాణం గురించి మాట్లాడుతూ 90స్ లో ఎంతోమంది హీరోయిన్లు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు.
21 ఏళ్ల వయసులో కెరీర్ ను స్టార్ట్ చేసిన సుస్మితా సేన్ మొదట్లో తనను తాను చెడ్డ నటిగా అనుకునే దాన్నని, కానీ తర్వాత ఇండస్ట్రీలో అర్థవంతమైన పాత్రల కంటే లుక్స్, స్టార్ స్టేటసే ముఖ్యమని అర్థం చేసుకున్నానని చెప్పింది. మిస్ యూనివర్స్ అయ్యాక కూడా తనకు లిమిటెడ్ క్యారెక్టర్లే దక్కాయని ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం హీరో కోసం మాత్రమే పెడతారని కూడా ఆమె చెప్పింది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్రలు ఎంత నిస్సారంగా ఉంటాయని, వారి పాత్రకు ఎలాంటి కథాబలం లేకుండా కేవలం సాంగ్స్ లో డ్యాన్సులను బట్టి, వారు వేసుకున్న డిజైనర్ బట్టలను బట్టే హీరోయిన్ స్థాయిని అంచనా వేస్తారని సుస్మితా సేన్ తాను ఎదుర్కొన్న అనుభవాలను ఉదాహరణగా చెప్పింది. అయితే ఎప్పుడైతే సుస్మిత ఓటీటీకి వచ్చిందో అప్పుడు తన కెరీర్ మొత్తం మారిపోయింది.
ఆర్యతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సుస్మిత ఆ తర్వాత విభిన్న క్యారెక్టర్లు చేయడంతో పాటూ ఆడియన్స్ తో కూడా బాగా కనెక్ట్ అవగలిగింది. కంటెంట్ ఉన్న కథలపై ఓటీటీలు దృష్టి పెట్టడం వల్ల సుస్మితా లాంటి నటీమణులకు పవర్‌ఫుల్ క్యారెక్టర్లు చేయడానికి అవకాశం రావడంతో పాటూ బాలీవుడ్ లిమిట్స్ నుంచి కూడా బయటకు రావడానికి వీలుంటుంది. మొత్తానికి బాలీవుడ్ లో రాని గుర్తింపు సుస్మిత లాంటి నటీమణులకు ఓటీటీ ద్వారా వస్తుందని అర్థం చేసుకోవచ్చు.