నిరాశ వద్దు.. ఆ కష్టం ఈనాటిది కాదు..
తాజాగా ఈయన ఈషా మూవీ.సక్సెస్ మీట్ లో పాల్గొని పలు విషయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.;
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. తాజాగా ఈయన ఈషా మూవీ.సక్సెస్ మీట్ లో పాల్గొని పలు విషయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఒక దర్శకుడు ఒక కథను తెరకెక్కించాలి అంటే నిర్మాణ సంస్థల చుట్టూ.. హీరోల చుట్టూ తిరగాలి అంటూ నూతన దర్శకులు, రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
తాజాగా ఈషా సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సురేష్ బాబు మాట్లాడుతూ.. "చాలా రోజులుగా యంగ్ డైరెక్టర్స్, యంగ్ స్టోరీ రైటర్స్ స్క్రిప్ట్ పట్టుకొని నిర్మాతలు, హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఐదారు సంవత్సరాల తరువాత ఆ స్టోరీ ఓకే అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ కష్టం అనేది ఈనాటిది కాదు. మా నాన్నగారు సినిమాలు నిర్మించే కాలంలోనే ఉంది. మా నాన్న డి రామానాయుడు ఫస్ట్ ఫిలింకి కూడా ఇలాగే జరిగింది. మా నాన్న మొదటి సినిమాకి కూడా నరసరాజు గారిని డైలాగ్స్ రాయడానికి ఫిక్స్ చేశారు.
అయితే కథ కోసం వెతుకుతూనే ఉన్నారట. ఎవరూ కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్ లో కూర్చున్నప్పుడు నరసరాజు గారు మా నాన్నకి ఒక కథ చెప్పారు. అదే రాముడు - భీముడు. అయితే ఈ కథ మా నాన్నకి చెప్పడానికంటే ముందు చాలా ఆఫీసులకు చాలా సార్లు చాలామందికి ఆయన చెప్పారు. కానీ చాలాసార్లు అది రిజెక్ట్ అయింది. అయితే మా నాన్నకు ఆ కథ నచ్చి, ఆ కథను రామారావు గారికి వినిపిస్తే ఆయన ఓకే చేసి.. అలా రాముడు భీముడు సినిమా తెరకెక్కింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ కష్టం అనేది ఈరోజుది కాదు. ఆనాటి నుంచే ఉంది.
స్క్రిప్ట్ రైటర్స్, దర్శకులు ఈ రేంజ్ లో కష్టపడితేనే సక్సెస్ మీ తలుపు తడుతుంది" అంటూ సురేష్ బాబు తెలిపారు. కాబట్టి అందరికీ చెప్పేదేమంటే మీ హోప్స్ ని వదులుకోకండి.. ఎవరు రిజెక్ట్ చేసినా.. మీ కథ ఏదో ఒక రోజు ఫైనల్ అవుతుంది. కచ్చితంగా పోరాడుతూనే ఉండండి.. అంటూ ఆయన నూతన దర్శకులకు, స్టోరీ రైటర్స్ కు పిలుపునిచ్చారు.
ఇక ప్రస్తుతం సురేష్ బాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు కథాబలం లేకుండా నిర్మించే చిత్రాల వల్లే సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతోంది అని కూడా తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడంలేదని.. పరిశ్రమే వారిని దూరం చేసుకుంటోందని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని, అందుకు కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలే నిదర్శనం అంటూ తెలిపారు. ముఖ్యంగా కథాబలం లేకుండా నిర్మించే చిత్రాల వల్ల సినీ పరిశ్రమకే కాదు ప్రేక్షకులు కూడా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.