RC17 సుక్కూ సర్ చెప్పను అనేశారు.. నిరాశ‌లో మెగాఫ్యాన్స్!!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన `పెద్ది` చిత్ర ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-06-24 04:45 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన `పెద్ది` చిత్ర ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ వేదిక‌పై స్ఫూర్తివంతమైన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. `రంగస్థలం`వంటి ఇండస్ట్రీ హిట్‌తో రామ్ చరణ్‌లోని అసలైన నటుడిని బయటకు తీసిన సుకుమార్, ఈ వేదికపై `పెద్ది` సినిమాలో చరణ్ నటనను ఆకాశానికెత్తారు. రామ్ చరణ్ ఈ కథను, ఆ పాత్రను ఎంతగా ఓన్ చేసుకుని నటించారో సుకుమార్ ఎంతో అద్భుతంగా వర్ణించారు.

ఇదే వేదికపై సుకుమార్ తన చిన్ననాటి మెగా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో చెబుతూ.. ``చిన్నప్పుడు మా ఫేవరెట్ హీరో చిరంజీవి గారి సినిమా ఎప్పుడైనా ఫ్లాప్ అయితే నేను అస్సలు నిద్రపోయేవాడిని కాదు. మళ్లీ ఆయనకు ఇంకొక హిట్టు సినిమా పడే వరకు నాకు నిద్ర పట్టేది కాదు`` అంటూ చిరుపై తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన కుమారుడైన రామ్ చరణ్ ని త‌మ‌కు అప్ప‌గించార‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. చ‌ర‌ణ్‌ వరుస హిట్లు కొడుతుంటే ఒక అభిమానిగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇక ఈ సక్సెస్ మీట్‌లో మెగా అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ తదుపరి చిత్రం `RC17` గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ స్టేజ్ కింద ఉన్న మెగా ఫ్యాన్స్ బిగ్గ‌ర‌గా అల్లరి చేయడం ప్రారంభించారు. ఫ్యాన్స్ గోల చూసిన సుకుమార్ వెంటనే టెంప్ట్ అవ్వ‌కుండా.. చాలా సేపు తాత్సారం చేస్తూ అభిమానులలో సస్పెన్స్‌ను అంతకంతకూ పెంచేస్తూ ఆటపట్టించారు.

ఫ్యాన్స్ అందరూ `RC17.. RC17`అంటూ ఒకే శబ్దంతో అరుస్తున్న వేళ సుకుమార్ మైక్ అందుకుని క్రేజీ కామెంట్స్ చేశారు. ``RC17 గురించి నాకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు.. నేను చెప్పను.. ఐ యామ్ సారీ! సినిమా ఎలా ఉండబోతుందో మీకు మీరే ఊహించుకోండి!`` అంటూ మెగాభిమానులకు ఒక పెద్ద పజిల్ విసిరేశారు. సుకుమార్ అంతలా సస్పెన్స్ మెయింటైన్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని ఫ్యాన్స్ థియేటర్లలో ఇప్పుడే ఊహించుకోవడం మొదలుపెట్టారు.

`రంగస్థలం` కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో RC17పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ ఈ వేదికపై ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా గుంభనంగా ఉంటూ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. మొత్తానికి`పెద్ది` సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్‌ను అభినందిస్తూనే... తన నెక్ట్స్ సినిమాపై సుక్కూ క్రియేట్ చేసిన ఈ క్రేజీ సస్పెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.





Tags:    

Similar News