స్టార్ల సినిమా వీక్షణ వెనుక ఉన్న సానుకూల కోణం!
ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు సినిమా చూస్తున్నారని తెలిస్తే? వారు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్‌ను ఎంజాయ్ చేయడానికి మొగ్గు చూపుతారు.;
సినీ పరిశ్రమలో పోటీ వాతావరణం సహజం. అయితే అగ్ర శ్రేణి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇతర సినిమాలను థియేటర్లో చూడటం అనేది పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనం. ఒక స్టార్ హీరో మరో స్టార్ సినిమాను చూడటం వల్ల అభిమానుల మధ్య ఉండే వైషమ్యాలు తగ్గుతాయి. వారి మధ్య ఐక్యత పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలు సినిమాల పట్ల గౌరవాన్ని పెంచడమే కాదు. పరిశ్రమ అంతా ఒకే కుటుంబం అనే భావనను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తాయి. స్టార్లు ఇలా బయటకు వచ్చి సినిమా చూడటం వల్ల ఆ చిత్రానికి లభించే ప్రచారం వెలకట్టలేనిది.
సోషల్ మీడియా యుగంలో వారు థియేటర్లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడం వల్ల ఆ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్స్ మరో స్టార్ సినిమాను చూస్తున్నారంటే? అది సాధారణ ప్రేక్షకులలో కూడా ఆ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. ఇది ఆ చిత్రానికి అదనపు బలాన్ని అందిస్తుంది. అలాగే ఇలాంటి గెట్-టుగెదర్ల వల్ల సృజనాత్మక మార్పిడికి అవకాశం ఉంటుంది. ఒక దర్శకుడు మరో దర్శకుడి మేకింగ్‌ను పరిశీలించడం.
ఒక హీరో ఇతర భాషా నటుల నటనను ప్రశంసించడం వల్ల భవిష్యత్తులో కొత్త తరహా కథలు, కాంబినేషన్లు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి. ధురందర్ 2 లాంటి భారీ యాక్షన్ సినిమాను ప్రభాస్ - సందీప్ వంగా వంటి యాక్షన్ ప్రియులు చూడటం వల్ల వారి రాబోయే ప్రాజెక్టులైన `స్పిరిట్ కోసం కూడా కొన్ని కొత్త ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. బాక్సాఫీస్ కోణంలో చూస్తే అగ్ర హీరోల మద్దతు వల్ల చిన్న ,మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఊతం లభిస్తుంది. పెద్ద సినిమాలు ఇప్పటికే హిట్ టాక్‌తో ఉన్నప్పుడు స్టార్ల రాక ఆ సినిమాను లాంగ్ రన్‌లో నిలబెడుతుంది.
ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు సినిమా చూస్తున్నారని తెలిస్తే? వారు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్‌ను ఎంజాయ్ చేయడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల థియేటర్ వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.భాషా సరిహద్దులు చెరిగిపోతున్న నేపథ్యంలో ఒక భాషా నటుడు మరో భాషా చిత్రాన్ని ఆదరించడం అనేది పాన్-ఇండియా సంస్కృతిని మరింత బలపరుస్తుంది. ప్రభాస్ వంటి టాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రాన్ని హైదరాబాద్‌లో చూడటం వల్ల జాతీయ స్థాయిలో సినిమాల మధ్య అనుబంధం పెరుగుతుంది.
ఇది కేవలం వసూళ్ల కోసమే కాదు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఒక మంచి అడుగుగా పరిగణించవచ్చు. స్టార్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం పరిశ్రమకు ఎంతో అవసరం. కేవలం పోటీ మాత్రమే కాకుండా ఒకరి పనిని మరొకరు అభినందించుకోవడం వల్ల సినిమా నాణ్యత పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలు సినిమాను కేవలం ఒక వ్యాపారంగా కాకుండా కళగా గౌరవించేలా చేస్తాయి.