సోష‌ల్ మీడియాను ప‌క్కాగా వాడుకున్న మొట్ట‌ మొద‌టి సినిమా?

ఈరోజుల్లో సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ ప్ర‌తిదానికి అవ‌స‌రంగా మారింది. కానీ ఒక‌ప్పుడు ఇంతగా సోష‌ల్ మీడియా లేదు.

Update: 2026-07-14 00:30 GMT

ఈరోజుల్లో సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ ప్ర‌తిదానికి అవ‌స‌రంగా మారింది. కానీ ఒక‌ప్పుడు ఇంతగా సోష‌ల్ మీడియా లేదు. అలాంటి రోజుల్లో కూడా త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ కి సోష‌ల్ మీడియాని స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకున్న ఘ‌న‌త రాజ‌మౌళి కాంపౌండ్ ది. భార‌తీయ చలనచిత్ర పరిశ్రమలో `బాహుబలి` చిత్రానికి ముందు, ఆ తర్వాత అనేంతలా మార్కెటింగ్ వ్యూహాలు మారిపోయాయని తాజా చిట్ చాట్ లో రాజ‌మౌళి వార‌సుడు, ప్రముఖ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ పేర్కొన్నారు. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు కేవలం మన ప్రాంతీయ పరిధుల వరకే పరిమితమై మార్కెటింగ్ చేసుకునేవాళ్లమని ఆయన గుర్తుచేశారు. ఆ రోజుల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు అప్పుడ‌ప్పుడే ప్రారంభ దశలో ఉండేవని తెలిపారు.

అయితే సోషల్ మీడియా -యూట్యూబ్ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మార్కెటింగ్‌లో ఎలా వాడుకోవచ్చో భారతదేశంలో మొదటిసారిగా నిరూపించి... ఒక కొత్త దారిని చూపించిన ఘనత `బాహుబలి` చిత్రానికే దక్కుతుందని కార్తికేయ స్పష్టం చేశారు. ఆ చిత్రం సృష్టించిన ట్రెండ్ వల్లే నేడు సోషల్ మీడియా అనేది ప్రతి సినిమా ప్రమోషన్ ప్లే-బుక్‌లో ఒక అనివార్యమైన భాగమైపోయిందని విశ్లేషించారు. ప్రతి సినిమాకూ ఒకే ఫార్ములా కాకుండా... అప్పటికి ఉన్న పరిస్థితులు, ఆ కథ ప్రాధాన్యతను బట్టి ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవ్వాలనే దాన్ని బట్టే బెస్ట్ మార్కెటింగ్ వ్యూహాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

అంతేకాదు.. వార‌ణాసి ప్ర‌చార వ్యూహం గురించి రివీల్ చేస్తూ.. సినిమా రిలీజ్ కి నెల‌రోజుల ముందు వివిధ న‌గ‌రాల్లో చేసే ప్ర‌చారం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజనం ఉండ‌ద‌ని కార్తికేయ చాలా ప్రాక్టిక‌ల్ గా వివ‌రించారు. దానికంటే సినిమా ప్రారంభం నుంచి అస‌లు ఈ సినిమా క‌థ‌, నేటివిటీ ప్ర‌జ‌ల‌కు ఎలా క‌నెక్ట‌యి ఉందో వివ‌రిస్తూ మొద‌టి నుంచి ప్ర‌చారం చేయాల‌ని సూచించాడు. బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో తాను ఎంపిక చేసుకున్న ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ ఇదేన‌ని తెలిపారు. రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రం వార‌ణాసికి ఆరంభం నుంచి ఇదే త‌ర‌హా ప్ర‌చారాన్ని ఎంపిక చేసుకున్నామ‌ని కార్తికేయ వివ‌రించారు.

ఫ‌హ‌ద్ ని అలా అభిమానిగా క‌లిసాక‌..

మరోవైపు.. న‌టుడు ఫహద్ ఫాజిల్‌తో తాను నిర్మిస్తున్న సినిమా కథ ఎలా ఓకే అయిందనే ఆసక్తికరమైన విషయాన్ని కార్తికేయ తెలిపారు. వాస్తవానికి తానేమీ ఫహద్‌ను ఒక సినిమా కథ కోసం కలవలేదని.. ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల `పుష్ప` చిత్ర షూటింగ్ సమయంలో కేవలం ఒక సాధారణ అభిమానిలాగా వెళ్లి కలిశానని తెలిపారు. అలా పెరిగిన పరిచయం తర్వాత తాము బ్యాక్-గ్రౌండ్‌లో `ఆక్సిజన్`.. `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` అనే రెండు భిన్నమైన స్క్రిప్టులను డెవలప్ చేస్తున్నట్లు ఆయనతో చర్చించామని పేర్కొన్నారు.

అందులో `ఆక్సిజన్` కథను ఫహద్ కోసమే రాసుకున్నా.. `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` కథ గురించి విన్న ఫహద్ ఫాజిల్ స్వయంగా ఆసక్తి చూపి పూర్తి కథ వింటానని అన్నారని కార్తికేయ వెల్లడించారు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అనుకుంటున్నట్లుగా ఫహద్‌ను ఒప్పించడం తనకు పెద్ద కష్టమేమీ కాలేదని.. కథ విన్న మొదటి సిట్టింగ్ లోనే ఆయన ఎంతో ఎగ్జైట్ అయి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న ఒక సరికొత్త వైవిధ్యమైన ప్రయోగం కావడం వల్లే ఫహద్ ఈ కథకు అంతగా కనెక్ట్ అయ్యారని చెప్పారు.

ఇక ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని కార్తికేయ తెలిపారు. దర్శకుడు తన మొదటి సినిమాకే ఊహించని స్థాయిలో భారీగా వీఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ రాసుకున్నాడని.. ఇప్పుడు అవుట్‌పుట్ చూశాక దాని ఇంటెన్సిటీ దర్శకుడికి కూడా అర్థమవుతోందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News