నిద్ర‌లో లేచి వెళ్లి ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాకింగే!

నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో సందేశం టాలీవుడ్‌లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

Update: 2026-08-28 17:17 GMT

నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో సందేశం టాలీవుడ్‌లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ `టార్టాయిస్` ప్రమోషన్లలో భాగంగా అత‌డు మాట్లాడిన మాటలు, అందులోని ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా ప్రచారమవుతున్నాయి.

శ్రీనివాస్ అవసరాల తన వీడియోలో ఒక యువ హీరో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు హీరో తనకు మంచి మిత్రుడని పేర్కొంటూ అత‌నొక విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నిద్రలో నడిచే వ్యాధి (స్లీప్‌వాకింగ్) వల్ల ఆ హీరో రాత్రిపూట తెలియకుండానే వీధుల్లోకి వచ్చేస్తున్నాడని చెప్పాడు.

రాత్రి ఒంటి గంట లేదా రెండు గంటల సమయంలో హైదరాబాద్ రోడ్లపై ఆ హీరో నిద్రలోనే `జాంబీ`లా నడుస్తూ కొందరికి కనిపించాడని శ్రీనివాస్ అవసరాల చెప్పారు. అయితే అత‌డి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, అర్ధరాత్రి వేళ రోడ్లపై కనిపిస్తే ఎవరూ తప్పుగా భావించవద్దని ప్రజలు, అభిమానులను కోరారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైర్ కావడంతో ఆ హీరో ఎవరై ఉంటారనే దానిపై నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు. నిద్రలో నడుస్తూ హత్యలు చేసే ఒక యువ హీరో కథాంశంతో `టార్టాయిస్` సినిమా రూపొందుతోందని స‌మాచారం. తాజా ప్రమోషనల్ వీడియో ఆ కాన్సెప్ట్‌ను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళుతోంది.

అలాగే ఆ హీరో ఎవరో కనిపెట్టి కామెంట్ సెక్షన్లలో గెస్ చేయాలని శ్రీనివాస్ అవసరాల ప్రేక్షకులను ఆహ్వానించారు. లహరి మ్యూజిక్ అందిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాపై ఈ వినూత్న ప్రచారం ద్వారా భారీ అంచనాలు పెరిగాయి. 30 ఆగ‌స్టు స‌స్పెన్స్ కి తెర‌దించుతామ‌ని అన్నారు. హీరో ఎవ‌రో వేచి చూడాలి.

అవసరాల శ్రీనివాస్ కెరీర్ జర్నీ:

అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి.. అక్కడే ప్రిన్స్‌టన్ ప్లాస్మా ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగం చేస్తూ.. సినిమాపై ఉన్న ఆశయంతో స్క్రీన్ రైటింగ్ కోర్స్ పూర్తిచేసి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అవసరాల శ్రీనివాస్. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `అష్టా చమ్మా` (2008) చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత `పిల్ల జమీందార్`, `అంతకుముందు ఆతరువాత`, `కంచె` వంటి చిత్రాలలో సహాయ నటుడిగా, కామెడీ క్యారెక్టర్లలో నటించి మెప్పించారు.

కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా మారిన శ్రీనివాస్.. `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మెగాఫోన్ పట్టి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. తొలి సినిమాతోనే తనదైన మేకింగ్ స్టైల్‌ను చూపిస్తూ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత `జ్యో అచ్యుతానంద`, `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా ప్రత్యేక ముద్ర వేశారు. పక్కా క్లాస్ చిత్రాలకు, స్వచ్ఛమైన భావోద్వేగాలకు చిరునామాగా నిలుస్తూ టాలీవుడ్‌లో తనదైన పంథాను కొనసాగిస్తున్నారు.

శ్రీనివాస్ అవసరాలలోని ఫన్, సెన్సాఫ్ హ్యూమర్, సర్కాజమ్ చాలా ప్రత్యేకం. ఆయన మాటల్లో.. రాసే సంభాషణల్లో ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా క్లీన్ అండ్ డ్రై హ్యూమర్‌తో నవ్వించడం అత‌డి శైలి. ఓ వైపు నటుడిగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూనే.. మరోవైపు రచయితగా, దర్శకుడిగా పాత్రలలోని లోతుపాతులను, భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తారు. క్లాసికల్ హ్యూమర్‌ను, ఆధునిక మానవ సంబంధాలను స్క్రీన్ పైకి తెచ్చే ఆయన రచన, మేకింగ్ శైలి.. ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా.. అత‌డిని తెలుగు చిత్రసీమలో ఒక యూనిక్ అండ్ జీనియస్ ఫిల్మ్ మేకర్‌గా నిలబెట్టింది.



Tags:    

Similar News