హైదరాబాద్‌లో టాప్- 6 క్రీడాకారుల లగ్జరీ విలాసాలు
జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, మణికొండ, చంద్రాయణగుట్ట, కోకాపేట్ వంటి ప్రైమ్ లొకేషన్లలో ఉన్న వీరి విలాసవంతమైన ఇళ్లు నగరంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్ ల్యాండ్ స్కేప్ ని ఆవిష్కరిస్తున్నాయి.
హైదరాబాద్ నగరం కేవలం వ్యాపార, ఐటీ రంగాలకే పరిమితం కాకుండా.. దేశంలోని ప్రముఖ క్రీడాకారులకు సైతం తమ కలల ఇల్లుగా మారింది. ప్రపంచ స్థాయి క్రీడా వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పలువురు క్రీడా తారలు హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, మణికొండ, చంద్రాయణగుట్ట, కోకాపేట్ వంటి ప్రైమ్ లొకేషన్లలో ఉన్న వీరి విలాసవంతమైన ఇళ్లు నగరంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్ ల్యాండ్ స్కేప్ ని ఆవిష్కరిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కఠిన శ్రమ, పట్టుదలకు అతడి ఇల్లే ఒక నిదర్శనంగా నిలుస్తుంది. జూబ్లీహిల్స్ సమీపంలోని ఫిల్మ్ నగర్‌లో సుమారు 13 కోట్ల విలువైన మల్టీ-స్టోరీ బంగళాను సిరాజ్ సొంతం చేసుకున్నాడు. అధునాతన ఇంటీరియర్స్, ప్రైవేట్ జిమ్‌తో పాటు, అతడు సాధించిన ట్రోఫీలను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన గదిని ఈ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే యువ బ్యాటర్ తిలక్ వర్మ తన చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడి ఉన్న చంద్రాయణగుట్టలోని సొంత స్థలంలోనే రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వ్యయంతో ఒక విలాసవంతమైన మల్టీ స్టోరీడ్ భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇందులో స్విమ్మింగ్ పూల్, పర్సనల్ జిమ్ వంటి ఆధునిక వసతులు ఉన్నాయి.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు నివాసాలు కూడా ఫిల్మ్ నగర్ పరిధిలోనే ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సానియా మీర్జాకు చెందిన విల్లా సుమారు రూ.13 కోట్ల విలువతో యూరోపియన్ - గ్రీక్ నిర్మాణ శైలిల కలయికతో అత్యంత విలాసవంతంగా డిజైన్ చేయడం ఆసక్తిని కలిగిస్తుంది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు మూడు అంతస్తుల హిల్ టాప్ బంగళాను నిర్మించుకున్నారు. ప్రకృతి ప్రేరేపిత థీమ్, మినిమలిస్ట్ డిజైన్‌తో నిర్మితమైన ఈ ఇల్లు గచ్చిబౌలిలోని తన శిక్షణా కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉంటుంది.
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ నివాసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలిని, సమకాలీన ఇంటీరియర్స్‌ను కలగలిపి నిర్మించిన ఈ ఇల్లు ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. మిథాలీ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి... నాయకత్వ పటిమకు ఈ ఇల్లు ఒక ప్రతీకగా నిలుస్తుంది. వీరితో పాటు భారత మాజీ బ్యాటింగ్ లెజెండ్ వి.వి.ఎస్. లక్ష్మణ్ కూడా మణికొండ ప్రాంతంలో విశాలమైన అత్యంత హుందాతనంతో కూడిన నివాసాన్ని నిర్మించుకున్నారు. మైదానంలో ఆయన ప్రదర్శించే క్లాస్ ప్లే.. ప్రశాంతమైన వ్యక్తిత్వానికి తగ్గట్లుగానే ఈ ఇల్లు రూపొందించడం ఆసక్తికరం.
సొంత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ ఆరుగురు అథ్లెట్లు హైదరాబాద్‌ను తమ నివాసంగా ఎంచుకోవడంతో ప్రపంచ పటంలో నగర ప్రాముఖ్యత మరింత పెరిగింది. సిరాజ్ ట్రోఫీ వాల్, సింధు హిల్ టాప్ వ్యూ, సానియా మీర్జా లగ్జరీ విల్లా ఇలా ప్రతి ఒక్కరి నివాసానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. సెలబ్రిటీలు- క్రీడా ప్రముఖులకు మొదటి ప్రాధాన్యతగా నిలుస్తూ... లగ్జరీ ప్రాపర్టీస్ పరంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇప్పటికే హవా సాగించింది. ప్రస్తుతం ఏఐ- జాబ్ క్రైసిస్ కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని కథనాలొస్తున్నాయి.