AI టూల్స్‌తో ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ పంట పండిన‌ట్టే

కృత్రిమ మేథ‌స్సు వేగంగా స‌న్నివేశాన్ని మార్చేయ‌బోతోంది. ఏఐ టూల్స్ రాక‌తో ఫిలింమేకింగ్ లో కొన్ని విభాగాల్లో ప‌ని సులువు అయిపోతోంద‌ని ఇప్ప‌టికే నివేదిక‌లు వ‌స్తున్నాయి.;

Update: 2026-02-27 05:30 GMT

కృత్రిమ మేథ‌స్సు వేగంగా స‌న్నివేశాన్ని మార్చేయ‌బోతోంది. ఏఐ టూల్స్ రాక‌తో ఫిలింమేకింగ్ లో కొన్ని విభాగాల్లో ప‌ని సులువు అయిపోతోంద‌ని ఇప్ప‌టికే నివేదిక‌లు వ‌స్తున్నాయి. ఇక‌పై క్రియేటివిటీకి సాంకేతిక‌త‌ను జోడించి ప‌ని చేయ‌గ‌లిగే వ్య‌క్తుల‌కు అవ‌కాశాలు పెద్ద‌గా అంది వ‌స్తాయ‌ని అంచ‌నా. అంతేకాదు.. ఔత్సాహికులైన న‌వ‌త‌రం ఫిలింమేక‌ర్స్ వేగంగా సినీరంగంతో ముడిప‌డిన‌ ఏఐ సాంకేతిక‌త‌ను నేర్చుకుంటే త‌మ ప‌ని సులువు అవుతుంద‌నేది ఒక అంచ‌నా.

నిజానికి మీ దగ్గర ఒక కథ ఉంటే దానికి రూపం ఇవ్వడానికి ఈ రోజుల్లో ఏఐ (AI) ఒక అద్భుతమైన వరప్రసాదం. ఒకప్పుడు వందల మంది టెక్నీషియన్లు చేసే పనిని ఇప్పుడు మీరు ఒక్కరే ఏఐ సహాయంతో పూర్తి చేయవచ్చని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. సినిమా నిర్మాణంలోని వివిధ దశల్లో ఏఐ టూల్స్ ఎలా ఉపయోగపడతాయో కొన్ని ఉదాహరణలతో విశ్లేషిస్తే..

స్క్రిప్ట్- స్క్రీన్ ప్లే స‌హకారం:

మ‌న‌ దగ్గర ఉన్నది ప్రాథమిక ఆలోచన లేదా సింగిల్ లైన్ స్టోరి అయితే.. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చడానికి ఏఐ వాడవచ్చు. ఏఐ టూల్స్ లో జెమిని ఏఐ, చాట్ GPT, క్లాడ్ వంటి సాధ‌నాలు మీకు కొంత‌వ‌ర‌కూ స‌హ‌క‌రించ‌గ‌ల‌వు. ``ఇది నా కథా వస్తువు.. దీనికి 10 సీన్లు ఉండేలా స్క్రీన్ ప్లే రాసివ్వు`` అని అడిగితే అది సంభాషణలతో సహా రాసిస్తుంది. సినిమా క‌థ‌లో కొత్త ప్ర‌పంచాల్ని క్రియేట్ చేయ‌డం ఎలానో ఏఐ ఇచ్చే ప్ర‌పంచాల్ని ముందే చూసుకునే వీలుంది. కొత్త ప్రపంచాన్ని సృష్టించడం కోసం ఏఐని ఉపయోగించి డీటెయిల్డ్ బ్యాక్ స్టోరీస్ రాసుకోవచ్చు. అయితే ఏఐ చేసే త‌ప్పిదాల‌ను క‌రెక్ట్ చేసుకునే నాలెజ్ మ‌న‌కు ఉంటే స‌రిపోతుంది. అది అందించేది వంద‌శాతం యాక్యుర‌సీ లేక‌పోయినా, మ‌న‌కు కొంత‌వ‌రకూ ప‌నిని సులువు చేసే విధంగా ఫీడింగ్ ఇవ్వ‌గ‌లదు. ముఖ్యంగా ఎమోష‌న్స్ విష‌యంలో ఇంకా ఏఐ వంద‌శాతం అభివృద్ధి చెంద‌లేద‌న్న‌ది గ‌మ‌నించాలి.

స్టోరీ బోర్డింగ్ - ప్రీ విజువలైజేషన్:

షూటింగ్ వెళ్ళకముందే మీ సీన్లు ఎలా ఉంటాయో ఫోటోల రూపంలో ఏఐ ని ఉప‌యోగించుకుని చూడవచ్చు. దీనికి Midjourney, DALL-E 3 వంటి AI టూల్స్ ఉప‌యోగించుకోవ‌చ్చు. మీ సీన్ వర్ణనను ఇస్తే.. అది హై క్వాలిటీ ఫోటోలను ఇస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు బాహుబ‌లి సినిమాని తీసుకుంటే, ఇందులోని భారీ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేయడానికి రాజమౌళి స్కెచ్‌లు వేయించుకున్నారు. ఇప్పుడు మీరు ఆ పనిని ఏఐతో నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

వీడియో జనరేషన్ :

కెమెరా లేకుండానే షాట్స్ క్రియేట్ చేయవచ్చు. దీనికి కొన్ని ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. Runway Gen-2, Sora, Pika Labs, Kling AI వంటి వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. మీరు రాసిన టెక్స్ట్ లేదా ఇచ్చిన ఫోటోను ఇవి సినిమాటిక్ వీడియోగా మారుస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు అవ‌తార్ లోని సముద్ర గర్భ దృశ్యాలను ఏఐ ఇప్పుడు చాలా సులువుగా తక్కువ ఖర్చుతో రీ క్రియేట్ చేయగలదు.

వాయిస్ ఓవర్ - సౌండ్ ట్రాక్:

మీ పాత్రలకు ప్రాణం పోయడానికి వాయిస్ ఏఐ ఇస్తుంది. దీనికి కొన్ని AI టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ElevenLabs (వాయిస్ కోసం), Udio లేదా Suno (సంగీతం కోసం) ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. పాత్ర స్వభావాన్ని బట్టి గంభీరమైన లేదా సున్నితమైన వాయిస్‌ని ఎంచుకోవచ్చు. ఎమోషన్స్ కూడా సెట్ చేయవచ్చు.

డీ-ఏజింగ్ & ఫేస్ స్వాపింగ్ (VFX)

నటుల వయస్సు తగ్గించడం లేదా ముఖాలు మార్చడం ఏఐతో సాధ్యం. ఉదాహ‌ర‌ణ చూస్తే హాలీవుడ్ మూవీ `ది ఐరిష్ మేన్` లో రాబర్ట్ డినీరో వయస్సు తగ్గించడానికి కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు DeepFaceLab (డీప్ ఫేస్ లాబ్) వంటి టూల్స్‌తో ఇంట్లోనే అది చేయవచ్చు.

ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ లేదా వ‌ర్క్ ఫ్లోను ట్రై చేయాలంటే:

1. Gemini లో కథను డెవలప్ చేసుకోవ‌చ్చు.

2. Midjourney లో క్యారెక్టర్ డిజైన్స్, లోకేషన్లు క్రియేట్ చేయొచ్చు...

3. Runway లేదా Luma Dream Machine ఉపయోగించి ఆ ఫోటోలను వీడియో క్లిప్స్ గా మార్చుకోవ‌చ్చు..

4. ElevenLabs లో డైలాగ్స్ రికార్డ్ చేసుకోగ‌లం..

5. ఏదైనా ఒక సాధారణ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ (CapCut లేదా Premiere Pro) లో అన్నిటినీ కలిపేయ‌వ‌చ్చు..

సాంకేతిక‌త‌ను విస్తారంగా ఉప‌యోగించుకోవాల‌నే జిజ్ఞాస‌, మంచి పుస్త‌క ప‌ఠ‌నం అల‌వాటు, ఆర్టిక‌ల్స్ రాసే ప్ర‌య‌త్నం చేసేవారికి లేదా క‌థ‌లు, స్క్రిప్టుల గురించి థింక్ చేసేవారికి ఇక‌పై ఫిలింమేకింగ్ మ‌రింత సులువు కానుంది. మునుపెన్న‌డూ అందుబాటులో లేని ఎన్నో టూల్స్ ఆన్ లైన్ లో అందుబాటులోకి వ‌చ్చాయి. వీటిని ఏ విధంగా ఉప‌యోగించుకోగ‌లిగారు అన్న‌ది వారి మేధ‌స్సు, హార్డ్ వ‌ర్క్, చొర‌వ‌, ప్ర‌య‌త్నాల‌కు నిద‌ర్శ‌నం కానుంది.

Tags:    

Similar News