20 ఏళ్ల కెరీర్‌లో అభద్రత లేని దర్శకుడు!
సక్సెస్ అంటే చాలా మంది నిర్వచనం వేరు. పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నిర్వచనం వేరు.;
సక్సెస్ అంటే చాలా మంది నిర్వచనం వేరు. పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నిర్వచనం వేరు. అతడు తనకు నచ్చిన సౌకర్యమైన సినిమా తీయడమే సక్సెస్ అని అన్నాడు. ఫలానా విజయవంతమైన సినిమాకి సీక్వెల్స్ తీస్తే అది సక్సెస్ అని అతడు నమ్మడం లేదు. వరుసగా భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సిద్ధార్థ్ తదుపరి షారూఖ్ తో కింగ్ లాంటి మరో భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కానీ యాక్షన్ జానర్ లో మాత్రమే సక్సెస్ ఉందని అతడు భావించడం లేదు.
జమానా కాలంలో, తన ఆరంగేట్రం రొమాంటిక్ కామెడీలతో మొదలైంది. ఇప్పుడు కూడా తిరిగి తన జానర్ కి మారాలని అనుకుంటున్నట్టు సిద్ధార్థ్ చెప్పారు. తన కెరీర్ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ మీడియాలతో మాట్లాడుతూ అతడు చాలా ఆసక్తికర విషయాలను బహిర్గతం చేస్తున్నారు.
2005లో సైఫ్- ప్రీతి జింతా జంటగా `సలామ్ నమస్తే` అనే రొమాంటిక్ కామెడీతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసాడు సిద్ధార్థ్ ఆనంద్. 2013లో బ్యాంగ్ బ్యాంగ్ లాంటి భారీ యాక్షన్ సినిమాని తీసాడు. కానీ ప్రారంభ కెరీర్ లో అతడు వరుసగా రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించి పాపులరయ్యాడు. తా రా రమ్ పమ్, బచ్నా ఏ హసీనో, అంజానా అంజాని వంటి రోమ్ కామ్ లు అతడికి మంచి పేరు తెచ్చాయి. కానీ బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత వరుసగా భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించాడు. హృతిక్- టైగర్ ష్రాఫ్‌లతో వార్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. పఠాన్ లాంటి యాక్షన్ సినిమాతో షారూఖ్ కి భారీ కంబ్యాక్ ని ఇచ్చిన ఘనతను సిద్ధార్థ్ దక్కించుకున్నాడు. హృతిక్‌తో ఏరియల్ యాక్షన్ మూవీ ఫైటర్ ని తెరకెక్కించిన ఘనత అతడి సొంతం అయింది.
అభద్రతాభావంతో ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తీయాలని సిద్ధార్థ్ అనుకోవడం లేదు. అతడు తిరిగి తన రొమాంటిక్ కామెడీ జానర్ కి రావాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తన మనసుకు నచ్చిందే చేస్తానని అంటున్నాడు. ఇతర దర్శకులతో పోలిస్తే, అతడి ఆలోచనలు వైవిధ్యంగా ఉన్నాయి. అందుకే నేడు భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరిగా సిద్ధార్థ్ ఆనంద్ ఎదిగారని భావించవచ్చు.