శివ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో?
టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఆడియన్స్ కూడా ఈ రీరిలీజుల ట్రెండ్ ను ఎంజాయ్ చేస్తుండటంతో ఆ క్రేజ్ ను వాడుకుని నిర్మాతలు కూడా నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు.;
టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఆడియన్స్ కూడా ఈ రీరిలీజుల ట్రెండ్ ను ఎంజాయ్ చేస్తుండటంతో ఆ క్రేజ్ ను వాడుకుని నిర్మాతలు కూడా నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు రీరిలీజై మంచి కలెక్షన్లు సాధించగా, కొన్ని సినిమాలు రీరిలీజుల్లో కూడా రికార్డులు సాధించాయి.
ఇండస్ట్రీకి సరికొత్త బాటలు వేసిన శివ
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది. ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున కెరీర్లో కల్ట్ మూవీగా నిలిచిన శివ. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఓ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎవర్ గ్రీన్ మైల్ స్టోన్ మూవీగా నిలిచిన శివ మూవీ అప్పటివరకు ఓ మూస ధోరణిలో వెళ్తున్న ఇండస్ట్రీకి సరికొత్త బాటలు వేసింది.
ట్రెండ్‌సెట్టర్ మూవీగా నిలిచిన శివ
డైరెక్టర్లు సినిమా తీసే విధానాన్నీ, ఆడియన్స్ సినిమా చూసే విధానాన్నీ శివ మూవీ పూర్తిగా మార్చేసింది. అందుకే తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పటికీ శివకు ముందు, శివ తర్వాత అని అంటుంటారు. అలాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. 1989లో రిలీజైన ఈ సినిమాను 4కె ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తుండగా, నాగార్జున, ఆర్జీవీ కూడా దాని కోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేసి ఆఖరికి ఓ మంచి ముహూర్తం చూసి శివ మూవీని రీరిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.
తరాలను దాటి జీవించే శక్తి సినిమాకు ఉంది
తన తండ్రి ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా శివ రీరిలీజ్ డేట్ ను నాగార్జున వెల్లడించారు. తరాలను దాటి జీవించే శక్తి సినిమాకు ఉందని తన తండ్రి ఎప్పుడూ నమ్మేవారని, శివ కూడా అలాంటి ఓ సినిమానే అని, ఈ సినిమాను నవంబర్ 14న 4కె డాల్బీ అట్మాస్ లో రిలీజ్ చేసి, కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచాలనే తన తండ్రి కోరికకు నివాళి ఇవ్వనున్నట్టు నాగార్జున చెప్పారు.
అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో రీ మాస్టర్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వెంకట్ అక్కినేని, సురేంద్ర యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించగా, రీరిలీజుల్లో మునుపెన్నడూ చేయని విధంగా ఈ సినిమాకు అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీని వాడి ఒరిజినల్ మోనో మిక్స్ నుంచి డాల్బీ అట్మాస్ కు రీమాస్టర్ చేసినట్టు మేకర్స్ చెప్తున్నారు. రిలీజ్ టైమ్ లో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా రీరిలీజ్ టైమ్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.