ఈ పరిస్థితుల్లో గొడవలు అవసరమా శంకర్ సార్..?
తమిళ దర్శకుడు శంకర్ కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగా నిలిచాయి.;
తమిళ దర్శకుడు శంకర్ కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లుగా నిలిచాయి. ప్రతి దర్శకుడికి ఏదో ఒక సమయంలో డిజాస్టర్ పడుతుంది. అట్టర్ ఫ్లాప్‌లు చవి చూడాల్సి వస్తుంది. కానీ దర్శకుడు శంకర్ ఆ రెండు సినిమాలతో అంతకు మించి అన్నట్లుగా ప్రేక్షకులను నిరాశ పరిచాడు, అంతే కాకుండా నిర్మాతలను కోలుకోలేకుండా చేశాడు. దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం తీసిన వృధా ఫుటేజ్ ఖర్చుతో మీడియం రేంజ్ సినిమాలు రెండు మూడు తీయవచ్చు అంటున్నారు. ఇక ఇండియన్ 2 సినిమా నిర్మాతలకు ఎంత నష్టమో ఇంకా లెక్కలు తేలడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ డిమాండ్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ వందల కోట్ల బడ్జెట్ మూవీని నెత్తికి ఎత్తుకోవడం మళ్లీ నిర్మాతలను రిస్క్‌లోకి దించడం అవుతుంది. అయినా కూడా ఆయన అదే తీరుతో వ్యవహరిస్తున్నాడు. తానో స్టార్ డైరెక్టర్‌ను, తాను అడిగితే ఎంత పెద్ద హీరో అయినా డేట్లు ఇస్తాడు అని శంకర్ భావిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే ఇండియన్ 3 సినిమా విడుదల పనులు పక్కన పెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పేర్కొంటున్న 'వేల్పారీ' పై వర్క్ మొదలు పెట్టాడు. అవతార్ రేంజ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఈ సినిమా కోసం అవసరం అని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే ఖచ్చితంగా బడ్జెట్ వందల కోట్లు ఉండే అవకాశం ఉంది.
ఇండియన్ 2 సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇండియన్ 3 విషయంలో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ సినిమాను ఏదోలా విడుదల చేస్తే నిర్మాతలకు చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 3 ముగించడం కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట. తన పారితోషికం మాత్రమే కాకుండా సినిమా మేకింగ్‌కు మరింత డబ్బు కావాలని నిర్మాణ సంస్థను డిమాండ్ చేయడంతో ఇక మా వల్ల కాదని సదరు నిర్మాణ సంస్థ చేతులు ఎత్తేసిందట. దాంతో ఇండియన్ 3 సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియన్ 3 ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది, అంతే కాకుండా తప్పకుండా మంచి కథతో సినిమా ఉంటుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేశారు.
కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 విడుదలైతే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఆర్థికంగా కొంతలో కొంత అయినా రికవరీ అవుతారని అంతా భావిస్తుంటే, ఇప్పుడు ఆ సినిమాను పూర్తి చేయడానికి దర్శకుడు శంకర్ భారీ మొత్తాన్ని ఖర్చు చేయమని డిమాండ్ చేస్తున్నాడు. వారు ఖర్చుకు సిద్ధంగా లేకపోవడంతో శంకర్ మరో ప్రాజెక్ట్ పై వర్క్ చేసేందుకు గాను రెడీ అవుతున్నాడు. గతంలో ఇండియన్ 2 మద్యలో వదిలేసి గేమ్ ఛేంజర్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత రెండు సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో రెండు సినిమాల ఫలితాలు ఏంటో మనం చూశాం.
ఇప్పుడు ఇండియన్ 3 పక్కన పెట్టి మరో సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం శంకర్ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలతో గొడవలు అవసరమా అంటూ స్వయంగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ నుంచి ఇప్పటికీ మంచి సినిమాను ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.