ఖాన్‌ల త్ర‌యం త‌లో దారి వెతుక్కున్నారు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఖాన్‌ల త్రయం షారూఖ్, సల్మాన్, అమీర్ ప్రస్తుతం తమ కెరీర్‌లో విభిన్నమైన దశల్లో ఉన్నారు.;

Update: 2026-04-25 03:00 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఖాన్‌ల త్రయం షారూఖ్, సల్మాన్, అమీర్ ప్రస్తుతం తమ కెరీర్‌లో విభిన్నమైన దశల్లో ఉన్నారు. ఒకప్పుడు ముగ్గురూ బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా సినిమాలు విడుదల చేసేవారు.. కానీ ఇప్పుడు వారి ప్రాధాన్యతలు మారాయి. ఒకరు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా..మరొకరు భారీ కాంబినేషన్‌పై కన్నేశారు. ఇంకొకరు మాత్రం నటుడి కంటే నిర్మాతగానే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ వరుస విజయాలతో జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె సుహానా ఖాన్‌ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సుహానా కెరీర్‌ను పటిష్టం చేయడమే కాకుండా.. తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకోవాలని షారూఖ్ భావిస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి .. ప్రముఖ నిర్మాత దిల్ రాజులతో కలిసి సల్మాన్ ఖాన్ ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. సౌత్ మేకింగ్ స్టైల్‌ను తన మాస్ ఇమేజ్‌కు జోడించి సరికొత్త మేజిక్ చేయాలని సల్మాన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ 2027 రంజాన్ విడుద‌ల‌ను టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకుంటోంది. తన ఆస్థాన పండుగ అయిన రంజాన్ సీజన్‌ను మళ్లీ సొంతం చేసుకునేలా సల్మాన్ ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నటుడిగా ఆయన ఇంకా ఏ చిత్రాన్ని అధికారికంగా ఖరారు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా నిర్మాణ రంగంపైనే ఉంది. ఆయన నిర్మాణంలో ఏక్ దిన్, లాహోర్ అనే రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇందులో `ఏక్ దిన్` చిత్రంలో అమీర్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తుండ‌గా, సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నటుడిగా విరామం తీసుకున్నా జునైద్ కెరీర్ ని చ‌క్క‌దిద్దేందుకు నిర్మాతగా కృషి చేస్తున్నారు. అలాగే నాణ్యమైన చిత్రాలను అందించడమే లక్ష్యంగా అమీర్ ముందుకు సాగుతున్నారు.

మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ భవిష్యత్తు ప్రణాళికలను చాలా స్పష్టంగా సిద్ధం చేసుకున్నారు. షారూఖ్ తన వారసురాలితో కలిసి బిజీగా ఉండగా, సల్మాన్ సౌత్ టెక్నీషియన్లతో పాన్ ఇండియా మార్కెట్‌ను గురిపెట్టారు. అమీర్ ఖాన్ మాత్రం తెర వెనుక ఉండి చిత్ర నిర్మాణంలో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. అప్ క‌మింగ్ రెండు మూడేళ్లు ఈ ఖాన్‌ల త్రయానికి కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారనున్నాయి.

Tags:    

Similar News