రా-వన్ సీక్వెల్ G-వన్.. షారూఖ్ మరో ప్రయోగం
భారతదేశంలో కమర్షియల్ సినిమా కింగ్ గా ఏలిన షారూఖ్ ఖాన్ కళాత్మక సినిమాల నటుడిగాను గొప్ప పేరు తెచ్చుకున్నారు.;
భారతదేశంలో కమర్షియల్ సినిమా కింగ్ గా ఏలిన షారూఖ్ ఖాన్ కళాత్మక సినిమాల నటుడిగాను గొప్ప పేరు తెచ్చుకున్నారు. ప్రయోగాలకు వెరవని స్వభావం షారూఖ్ సొంతం. అందుకే దశాబ్ధాలుగా అతడు తనను తాను సూపర్ స్టార్ గా నిలబెట్టుకోగలిగాడు.
కింగ్ ఖాన్ తన కెరీర్ లో తెరకెక్కించిన అత్యంత ప్రయోగాత్మక చిత్రంగా రా.వన్ (2011) రికార్డులకెక్కింది. అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారూఖ్ సూపర్ హీరోగా కనిపించగా, కరీనా కపూర్ అతడి ప్రియురాలిగా నటించారు. సూపర్ హీరో కథ కాబట్టి దానికనుగుణంగా సాంకేతికంగా అత్యుత్తమ నిపుణులతో అద్భుతాలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోకపోవడం అప్పట్లో నిరాశను మిగిల్చినా కానీ, షారూఖ్ తాను ఇలాంటి ప్రయోగాలు చేయడం ద్వారా పరిశ్రమను మరింత పెద్దగా చూడాలనుకున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి స్టూడియోలు మన భారతదేశానికి రావాలని తాను కోరుకున్నట్టు వెల్లడించాడు.
ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత షారుఖ్ ఖాన్ తన 60వ పుట్టినరోజున, రా.వన్ సీక్వెల్ త్వరలో రావచ్చని హింట్ ఇచ్చాడు. దీనికి అనుభవ్ సిన్హా కథ రాయాలని, అతడు ఓకే అయితే జి.వన్ లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షారూఖ్ స్వయంగా ప్రకటించారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న కథతో అనుభవ్ చాలా శ్రమించారని ఖాన్ తెలిపారు. రా.వన్ వంటి సినిమా ఈరోజు విడుదలై ఉంటే, ప్రజలు దీన్ని మరింత ఇష్టపడేవారని షారుఖ్ ఖాన్ అన్నారు.
నేను ఎప్పుడూ ఒక సినిమా తీస్తే దానితో నా స్థానం మెరుగవుతుందని ఆశిస్తాను.. అలాంటి సినిమాలు తీయడానికి వెనకాడను. ఇతరులను ప్రేరేపించేవి తీయాలని నేను ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే అది మన దేశానికి చాలా ముఖ్యమైనది. రా వన్ తీసినప్పుడు ఇది సూపర్ హీరో సినిమానే కాదు... విజువల్ ఎఫెక్ట్స్ గురించిన చర్చా సాగింది. స్టూడియోలు ఇక్కడికి వస్తాయి, చాలా విషయాలు మారతాయి కాబట్టి ప్రయోగం చేసాను. ఇది అంచనాలను అందుకోకపోయినా ప్రజలు దానిని ఇష్టపడ్డారని ఖాన్ అన్నారు. రా.వన్ గురించి చాలా కష్టపడ్డామని కూడా ఖాన్ తెలిపారు. సీక్వెల్ కోసం అనుభవ్ నా దగ్గరకు వస్తే, నేను రెడీగా ఉన్నానని తెలిపారు.
షారుఖ్ షష్ఠిపూర్తి వేడుకలు అలీభాగ్ లో జరగగా, బాంద్రాలోని బాల గంధర్వ రంగమందిర్ ఆడిటోరియంలోను ఈ వేడుకలను జరుపుకున్నారు. ఇక్కడ ఖాన్ 300 మందికి పైగా అభిమానులను కలుసుకున్నాడు, బంగారు కిరీటంతో అలంకరించిన మూడు పొరల కేక్‌ను కట్ చేసాడు. ఖాన్ మేనేజర్ పూజా దద్లాని కూడా వేడుకల్లో పాల్గొన్నారు.