ప్రజలకు హాని జరిగితే ప్రభుత్వాలు బ్యాన్ చేయాలి కదా? కింగ్ ఖాన్ ప్రశ్న!
ఇప్పుడు పాన్ మసాలా బ్రాండ్ టైటిల్ ని ఉపయోగించి యాలకులు లేదా ఇలాచీకి ప్రచారం చేయడంపై కోర్టు స్టార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం.. దానిపై బిగ్ డిబేట్ మొదలైపోవడం తెలిసిందే.
సిగరెట్లు, కోలాలు, పాన్ మసాలాలకు ప్రచారం చేయకూడదని స్టార్లపై ప్రభుత్వాలు బ్యాన్ విధించడం సరైనదేనా? ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేసే స్టార్లను బ్యాన్ చేయాలా? లేక ఆ ఉత్పత్తినే బ్యాన్ చేయాలా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులువు. అసలు ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తినే లేకుండా చేసేస్తే, అప్పుడు ఖాన్ లు, కపూర్ లు లేదా ఇంకెవరైనా స్టార్ ప్రచారం చేయరు కదా! అనేది కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ పాయింట్.
ఇప్పుడు పాన్ మసాలా బ్రాండ్ టైటిల్ ని ఉపయోగించి యాలకులు లేదా ఇలాచీకి ప్రచారం చేయడంపై కోర్టు స్టార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం.. దానిపై బిగ్ డిబేట్ మొదలైపోవడం తెలిసిందే. చాలా కాలం క్రితం కింగ్ ఖాన్ షారూఖ్ నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం పోకూడదు. కానీ మాలాంటి వ్యక్తులకు ఆదాయం రానివ్వకూడదు!! అంటూ షారూఖ్ సూటిగానే నిలదీసారు. సిగరెట్లు, కోలాలతో ప్రజలకు ప్రమాదం ఉంటే వాటిని నిషేధించాలి కదా? అని ఖాన్ ప్రశ్నించారు. అయినా ఇదెక్కడి ద్వంద్వ న్యాయం? ప్రభుత్వానికి అయితే ఒక రూలు.. ప్రజలకు అయితే మరో రూల్! అదెట్టా? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాల్లో దీనిపై విస్త్రతంగా చర్చ సాగుతోంది. అసలు హాని కలిగించే ఏ ఉత్పత్తిని ప్రభుత్వం క్షమించకూడదు. నల్లమందు, గంజాయి, ఓపియం వంటి వాటిని నిషేధించినట్టే, ఈ పొగాకు ఉత్పత్తులను కూడా బ్యాన్ చేయాలి. సిగరెట్లకు ధర పెంచినంత మాత్రాన వాటిని కాల్చడం ఆపేసారా? అందువల్ల మొదలునే తుంచేస్తేనే చిగురు అనేది పుట్టదు కదా! మొదలు నరికేసినా చిగుళ్లు పుట్టుకొస్తాయి. అలా కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనేది షారూఖ్ ఖాన్ సూచన.
ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ థ్రెడ్ లలో పాన్ మసాలా టాపిక్ పై బోలెడంత చర్చ సాగుతోంది. `సరోగేట్` పాన్ మసాలా - పొగాకు ఉత్పత్తులను (చాందీ ఎలైచీ పేరుతో) ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్లపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు చర్చగా మారాయి. నటులు తమ ప్రకటనలను అమాయకపు మౌత్ ఫ్రెష్నర్లుగా సమర్థించుకోవడాన్ని నెటిజన్లు ఎగతాళి చేయడంతో పాటు.. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే సెలబ్రిటీలకు సామాజిక, నైతిక బాధ్యత ఉండాలని నెటిజనులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతినిస్తూ కేవలం ప్రకటనలపైనే ఆంక్షలు విధించడంపై కొందరు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండగా... మరికొందరు ఐఏఎస్ అధికారి తుకారాం ముండే వంటి అధికారుల కఠిన నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు.
భారతదేశంలో ఉన్న `వినియోగదారుల పరిరక్షణ చట్టం`, `సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ` (CCPA) మార్గదర్శకాల ప్రకారం సరోగేట్ అడ్వర్‌టైజింగ్ తీవ్రమైన నేరం. పొగాకు లేదా మద్యం బ్రాండ్ల పేర్లను ఉపయోగించి యాలకులు లేదా మినరల్ వాటర్ పేరుతో పరోక్ష ప్రకటనలు ఇవ్వడంపై స్పష్టమైన నిషేధం ఉంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే లేదా వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఎంతటి అగ్ర నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లయినా చట్టపరమైన పర్యవసానాలు అనుభవించాల్సిందేనని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే సమస్యను మొగ్గలోనే తుంచేయకుండా వృక్షంగా మలిచేది మాత్రం ప్రభుత్వమేనని ఒక సెక్షన్ నెటిజనులు కూడా వాదిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులను పండించే దశలోనే ఆపేయాలి. వాటిని పాన్ మసాలాలుగా తయారు చేయడానికి ఆస్కారం లేని చట్టాలు తేవడం ద్వారా ప్రమాదాన్ని అరికట్టాలని పలువురు సూచిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను వసూళ్ల కక్కుర్తితో ప్రభుత్వాలు ప్రజా జీవితాలతో ఆడుకోకూడదని కూడా కొందరు సూచిస్తున్నారు.