గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌పై ల‌క్ష మందికి కౌన్సిలింగ్.. అల్లూ ఫ్యాన్స్ AAFA ఘ‌న‌త‌!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అభిమాన సంఘాలు అనగానే మనకు భారీ కటౌట్లు, థియేటర్ల వద్ద హడావుడి- ట‌పాసుల మోత‌- ర‌క్త‌, పాలాభిషేకాలు.. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు, గొడ‌వ‌లే గుర్తుకొస్తాయి.

Update: 2026-08-16 17:59 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అభిమాన సంఘాలు అనగానే మనకు భారీ కటౌట్లు, థియేటర్ల వద్ద హడావుడి- ట‌పాసుల మోత‌- ర‌క్త‌, పాలాభిషేకాలు.. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు, గొడ‌వ‌లే గుర్తుకొస్తాయి. అయితే ఈ రొటీన్ ఫ్యాన్ సంస్కృతికి భిన్నంగా ఒక విప్లవాత్మక మార్పు మెగాభిమానుల‌తో ఏనాడో మొదలైంది. సినీ అభిమానం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా.. సమాజానికి మేలు చేసే దిశగా ఎలా ఉపయోగపడగలదో మెగాస్టార్ చిరంజీవిలోని సేవాభావం, చొర‌వ‌తో అసాధార‌ణ స్థాయికి ఎదిగింది. మెగా న‌ట‌వార‌సులంతా అదే బాట‌లో ఉన్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) దీనిని కొన‌సాగిస్తోంది. తమ నాయకుడి పిలుపును అందుకుని సామాజిక బాధ్యతతో ప్రాణాలను కాపాడే హెల్త్ ఉద్యమాన్ని చేపడుతూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు.




 


ఇటీవల ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మహిళల ఆరోగ్య సంరక్షణ దిశగా ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నివారణకు ఎంతో కీలకమైన హెచ్‌పివి (HPV) వ్యాక్సినేషన్‌పై విస్తృతమైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. `స్వస్థ్ నారి - వికసిత్ భారత్` కార్యక్రమంలో భాగంగా ఈ డ్రైవ్‌ను నిర్వహించారు. మహిళా ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ.. అంతగా వెలుగులోకి రాని ఈ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఫ్యాన్స్ వాలంటీర్లుగా మారి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేశారు.

ఈ కార్యక్రమ ప్రభావం సామాన్యమైనది కాదు.. దాదాపు 7 రాష్ట్రాలలో 400 కంటే ఎక్కువ అవగాహన సదస్సులను విజయవంతంగా నిర్వహించి సుమారు 1,00,000 మంది యువతులకు హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి కుటుంబాలకు హెచ్‌పివి నివారణ మార్గాలపై స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడం ద్వారా ఎంతోమంది మహిళల భవిష్యత్తుకు ఈ ఫ్యాన్స్ రక్షణగా నిలిచారు.

అభిమాన సంఘాల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ సానుకూల మార్పు వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో అనవసరమైన నెగెటివిటీకి, ఫ్యాన్ వార్స్‌కి దూరంగా ఉండాలని.. అభిమానుల శక్తిని సమాజానికి ఉపయోగపడే మంచి పనుల కోసం మళ్లించాలని అల్లు అర్జున్ పలువేదికలపై పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను స్వయంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. హీరో చూపిన బాటలోనే నడుస్తూ ఫ్యాన్స్ కూడా ఈ సామాజిక బాధ్యతను తమ గుర్తింపుగా మార్చుకున్నారు.

తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలోనే ఉన్న అన్ని రకాల ఫ్యాన్ క్లబ్‌లకు ఒక ఆదర్శవంతమైన మోడల్‌గా నిలిచింది. హంగామా సృష్టించే అభిమానం కంటే.. సమాజ శ్రేయస్సు కోసం నిలబడే అభిమానమే గొప్పదని వీరు చాటిచెప్పారు. సరిగ్గా దిశానిర్దేశం చేస్తే ఒక స్టార్‌కు ఉన్న క్రేజ్ , ఫ్యాన్ బేస్ సమాజంలో ఎంతటి గొప్ప మార్పును తేగలదో.. ఎన్ని వేల జీవితాల్లో వెలుగులు నింపగలదో ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిరూపించింది. ఈ వ్యాక్సినేష‌న్ 9 సంవ‌త్స‌రాలు అంత‌కుమించిన వ‌య‌సు ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది.

Tags:    

Similar News