రూట్ మార్చిన సీనియర్ హీరోయిన్లు!

ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్లు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

Update: 2026-06-06 22:30 GMT

హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువనేది ఒకప్పటి మాట. కొత్త హీరోయిన్ల పోటీ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మధ్య పరిశ్రమలో దశాబ్ద కాలంగా ఉనికిని కాపాడుకోవడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్లు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రొటీన్ గ్లామర్ పాత్రలు, పాటలకే పరిమితమయ్యే క్యారెక్టర్లను పక్కనబెట్టి తమలోని నటనను కొత్త కోణంలో ఆవిష్కరించే బోల్డ్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు రూట్ మారుస్తున్నారు. ఈ సరికొత్త ప్రయాణంలో మిల్కీ బ్యూటీ తమన్నా అందరి కంటే ఒక అడుగు ముందే ఉన్నారు.

కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌తో మెప్పించిన అమ్మ‌డు ప్రస్తుత పోటీని తట్టుకుంటూ డిజిటల్ .. వెండితెరపై ప్రత్యేకతను చాటుకోవడానికి బోల్డ్ క్యారెక్టర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే త‌మ‌న్నా న‌టిస్తోన్న‌ తాజా హర్రర్ థ్రిల్లర్ సిరీస్ `రాగిణి MM 3` పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా పాత్ర డిమాండ్ మేరకు బోల్డ్‌గా నటించడానికి సిద్ధపడటం అమ్మ‌డిలో ప్రయోగానికి అద్దం ప‌డుతోంది. మరోవైపు చందమామ కాజల్ అగర్వాల్ సైతం సామాజిక బాధ్యత గల పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

గ్లామర్ పాత్రల నుండి విరామం ప్ర‌క‌టించి కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. సమాజంలో తీవ్ర కలకలం రేపుతున్న ఆహార కల్తీ .. పురుగుల మందుల దుర్వినియోగం వల్ల ప్రజారోగ్యంపై పడే ప్రమాదకర ప్రభావాల నేపథ్యంలో తెరకెక్కుతున్న `ఇండియా స్టోరీ`చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రను పోషిస్తుండటం విశేషం. సమాజాన్ని ఆలోచింపజేసే కోర్టు రూమ్ డ్రామా కాజ‌ల్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని అంచ‌నాలున్నాయి. అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ లేడీ ఓరియెంటెడ్.. యదార్థ గాథలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంటారు.

అమ్మ‌డు న‌టిస్తోన్న‌ తాజా చిత్రం `భారత్ భాగ్య విధాత` దేశభక్తి, మానవీయ విలువల నేపథ్యంలో తెరకెక్కుతోంది. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో కామా హాస్పిటల్‌లో ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది రోగులను, ప్రజలను కాపాడిన వీర నర్సుల యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సైతం రూట్ మార్చి సరికొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో `యశోద`, `శాకుంతలం` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రయోగాలు చేసిన అమ్మ‌డు ఈసారి గ్లామర్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. లవ్ అండ్ రొమాంటిక్ కథల జోలికి వెళ్లకుండా విభిన్నమైన `మా ఇంటి బంగారం` అనే యాక్షన్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌ను ఎంచుకుంటున్నారు. కుటుంబ విలువల కలయికతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న పాత్ర సమంత కెరీర్‌లో సరికొత్త మలుపు తిప్పనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News