6 గంటల మేకప్.. 12 గంటల షూటింగ్.. కార్తీ డెడికేషన్‌కు అవాక్క‌వాల్సిందే!

ఇక మార్కెట్ పరంగా కూడా సర్దార్2పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మొదటి భాగం సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్‌కు తమిళంతో పాటు తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

Update: 2026-06-10 08:25 GMT

తమిళ స్టార్ హీరో కార్తీ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో సర్దార్2 ఒకటి. డైరెక్ట‌ర్ పీఎస్ మిత్రన్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జార్జ్ సి విలియమ్స్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమా చుట్టూ మళ్లీ భారీ హైప్ ఏర్పడింది. షూటింగ్ పూర్తై చాలా నెలలు గడిచినా రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్న టైమ్ లో ఆయన వెల్లడించిన విషయాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన జార్జ్ సి విలియమ్స్, సర్దార్2 తన కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 8 భారీ సెట్లను నిర్మించారని, దాదాపు 15 నెలల పాటు షూటింగ్ కొనసాగిందని వెల్లడించారు. సినిమా స్కేల్‌ను బట్టి చూస్తే ఇది సాధారణ సీక్వెల్ కాదని, మొదటి భాగాన్ని మించి మరింత భారీ స్థాయిలో రూపొందించారని ఆయన కామెంట్స్ సూచిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని ఎయిర్‌క్రాఫ్ట్ ఫైట్ సీక్వెన్స్ ఆడియ‌న్స్ ను ఆశ్చర్యపరుస్తుందని, అలాగే ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో భారీ రెస్పాన్స్ ను తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎడిటింగ్, సీజీ వర్క్ జరుగుతోందని, అన్ని పనులు పూర్తైన తర్వాత రిలీజ్‌పై మేకర్స్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

అయితే జార్జ్ వ్యాఖ్యల్లో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది కార్తీ డెడికేషన్ గురించిన అంశమే. సర్దార్ పాత్ర కోసం ప్రత్యేకమైన మేకప్ ప్రాసెస్‌ను అనుసరించిన కార్తీ, పాత్రను నమ్మదగిన విధంగా చూపించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన తెలిపారు. సాధారణంగా ఆ మేకప్ సుమారు ఆరు గంటల వరకు మాత్రమే పర్ఫెక్ట్‌గా ఉంటుందని, కానీ షూటింగ్ అవసరాల దృష్ట్యా కార్తీ ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నిరవధికంగా పనిచేసేవారని వెల్లడించారు. మేకప్ లిమిటేష‌న్స్ ఉన్నప్పటికీ షూటింగ్ ఆపకుండా ఫుల్ డెడికేష‌న్ తో పనిచేయడం తనను ఆశ్చర్యపరిచిందని జార్జ్ చెప్పారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా కథ, పాత్ర, టెక్నికల్ అంశాలపై కూడా కార్తీకి ఉన్న అవగాహన సినిమా క్వాలిటీని మరింత పెంచిందని ఆయన ప్రశంసించారు.

ఇక మార్కెట్ పరంగా కూడా సర్దార్2పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మొదటి భాగం సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్‌కు తమిళంతో పాటు తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. భారీ యాక్షన్ ఎపిసోడ్లు, ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ విజువ‌ల్స్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే అతిపెద్ద పాన్ ఇండియా రిలీజ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో కార్తీకి కూడా ఒక బలమైన కమర్షియల్ హిట్ అవసరమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జార్జ్ సి విలియమ్స్ కామెంట్స్ వింటుంటే, సర్దార్2 కేవలం మరో సీక్వెల్ మాత్రమే కాకుండా కార్తీ కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పైనే నిలిచింది.

Tags:    

Similar News