సారంగపాణి జాతకం వాయిదా.. బయ్యర్ల సూచనలతో కొత్త తేదీ?
కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విడుదల తేదీపై మళ్లీ ఆలోచన ప్రారంభమైందట.;
టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోందని అంచనాలు ఏర్పడ్డాయి.
మొదట సినిమా విడుదల తేదీగా ఏప్రిల్ 18ను మేకర్స్ ఖరారు చేశారు. వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించాలన్న ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విడుదల తేదీపై మళ్లీ ఆలోచన ప్రారంభమైందట. బయ్యర్ల సూచన మేరకు సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి అదే రోజున ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కూడా రిలీజ్ కావడంతో కొన్ని ప్రాంతాల్లో థియేటర్ లభ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ సమస్యలు వచ్చే అవకాశముండటంతో, సారంగపాణి జాతకానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సినిమాను కొంచెం వాయిదా వేసి విడుదల చేయాలని సూచించారట.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఏప్రిల్ 25 తేదీపై పరిశీలన జరుపుతున్నారని సమాచారం. అది కూడా శుక్రవారం కాకపోయినా సమీపంలో పెద్ద సినిమాలు లేకపోవడం, స్క్రీన్స్ ఎక్కువగా లభించేవి కావడంతో ఆ తేదీపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరికొన్ని రోజుల్లో అధికారికంగా రిలీజ్ డేట్ మారిందో లేదో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రియదర్శికి ‘కోర్ట్’ వంటి విజయవంతమైన చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను సారంగపాణి జాతకం కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వెన్నెల కిషోర్, నరేష్, వైవా హర్ష, తణికెళ్ళ భరణి తదితరులు నటించిన ఈ సినిమాలో రూపా కొడువయూర్ కథానాయికగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా, త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మొత్తానికి.. సారంగపాణి జాతకం వాయిదా సమాచారం అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కొత్త తేదీ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.