40 ఏళ్ల బాక్సాఫీస్ రైవల్రీ మళ్లీ రిపీట్.. బాలయ్య-నాగ్ క్లాష్‌కు టాలీవుడ్ రెడీ!
అయితే ఈసారి సంక్రాంతి పోటీ కేవలం బాలయ్య- నాగ్ మధ్య మాత్రమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబో మూవీ, అలాగే విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయని సమాచారం.
తెలుగు చిత్రసీమలో 2027 సంక్రాంతి సీజన్ ఇప్పటినుంచే హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఎన్టీఆర్- ఏఎన్నార్ టైమ్ లో కనిపించిన బాక్సాఫీస్ పోటీని గుర్తు చేస్తూ, ఇప్పుడు వారి నటవారసులు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మరోసారి పొంగల్ బరిలో తలపడబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీశాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బాలయ్య- నాగ్ బాక్సాఫీస్ రైవల్రీ మళ్లీ రిపీట్ కానుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమా లాటరీ కింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో నాగార్జున 100వ సినిమా vs బాలయ్య మాస్ బ్లాస్ట్ అనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఇప్పటికే 1987 నుంచి మొదలైన బాలయ్య-నాగ్ బాక్సాఫీస్ పోటీకి ఓ స్పెషల్ హిస్టరీ ఉంది. భార్గవరాముడు-మజ్ను నుంచి భైరవద్వీపం- హలో బ్రదర్, డిక్టేటర్- సోగ్గాడే చిన్నినాయనా వరకు ఎన్నోసార్లు ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. కొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తే, మరికొన్ని సందర్భాల్లో నాగార్జున విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు అదే రైవల్రీ 2027లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో 40 ఏళ్ల బాక్సాఫీస్ రైవల్రీ.. మళ్లీ రిపీట్! అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఓటీటీ ప్రభావం పెరిగిన ఈ కాలంలో కూడా సీనియర్ హీరోల మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని ఈ క్లాష్ ప్రూవ్ చేస్తుందా? అనే ట్రేడ్ వర్గాల ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ఈసారి సంక్రాంతి పోటీ కేవలం బాలయ్య- నాగ్ మధ్య మాత్రమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబో మూవీ, అలాగే విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయని సమాచారం. ఒకప్పుడు తెలుగు సినిమాను ఏలిన ఈ నలుగురు స్టార్ హీరోలు మళ్లీ ఒకే సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో సందడి చేయబోతుండటం సినీప్రియుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సమయంలో ఇది టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ క్లాష్‌లలో ఒకటిగా మారే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటినుంచే ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. బాలయ్య అభిమానులు ఆయన మాస్ ఇమేజ్, సంక్రాంతి సెంటిమెంట్‌ను హైలైట్ చేస్తుంటే, నాగార్జున ఫ్యాన్స్ మాత్రం 100వ సినిమా సెంటిమెంట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ్‌కు ఉన్న క్రేజ్‌ను ముందుకు తెస్తున్నారు. ట్విట్టర్, యూట్యూబ్, ఫ్యాన్ పేజీల్లో పోస్టర్లు, ఫ్యాన్‌మేడ్ టీజర్లు, బాక్సాఫీస్ అంచనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్‌కు పండుగ.. బాక్సాఫీస్‌కు పరీక్ష! అనే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకే సీజన్‌లో ఇంతమంది సీనియర్ స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల కేటాయింపు నుంచి కలెక్షన్ల వరకు తీవ్ర పోటీ ఉండనుంది. అయితే ఇదే సమయంలో టాలీవుడ్‌కు భారీ బిజినెస్ తెచ్చిపెట్టే సంక్రాంతిగా 2027 నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.