30 వేల కోట్ల ఆస్తి కోసం గొడ‌వ‌.. నిర్మాత‌ హ‌త్య‌కు కార‌ణాలు తేల్చారు!

ప్ర‌ముఖ న‌టుడు- సినీనిర్మాత‌, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ ఇటీవ‌ల లండ‌న్ లో గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-05 17:21 GMT

ప్ర‌ముఖ న‌టుడు- సినీనిర్మాత‌, పారిశ్రామిక వేత్త సంజ‌య్ క‌పూర్ ఇటీవ‌ల లండ‌న్ లో గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అత‌డు పోలో ఆడుతుండ‌గా, తేనెటీగ అత‌డి శ్వాస‌నాళంలోకి ప్ర‌వేశించి కుట్టింది. ప‌ర్య‌వ‌సానంగా అలెర్జీ ఏర్ప‌డి, గుండె నొప్పితో సంజ‌య్ మ‌ర‌ణించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ మ‌ర‌ణానికి కార‌ణం కుట్ర అంటూ ఆరోపించారు సంజ‌య్ క‌పూర్ త‌ల్లి.

అంత‌ర్జాతీయ కుట్ర నిజ‌మా?

త‌న కుమారుడు హ‌త్య‌కు గుర‌య్యాడ‌నే అనుమానాల్ని అత‌డి త‌ల్లి వ్య‌క్తం చేసారు. హ‌త్యకు కార‌ణం తన ప్ర‌స్తుత‌ కోడలు, సంజ‌య్ క‌పూర్ భార్య‌ ప్రియా స‌చ్ దేవ్ కుట్ర అని కూడా అత్త రాణీ దేవి ఆరోపించారు. ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఆయన హత్యకు గురయ్యారు! అనే సందేహాల్ని వ్య‌క్తం చేసిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. దాదాపు 30వేల కోట్ల విలువైన సోనా గ్రూప్ నియంత్ర‌ణ కోసం సాస్ వ‌ర్సెస్ బాహు (అత్త వ‌ర్సెస్ కోడ‌లు) పోరు మొద‌లైంద‌ని అప్ప‌ట్లో క‌థనాలొచ్చాయి. అదే క్ర‌మంలో కోడ‌లు ప్రియా సచ్ దేవ్ బోర్డ్ స‌భ్యురాలిగా నియ‌మితురాలు అవ్వ‌డం, ఆపై అత్త‌గారు హ‌త్యా ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నం అయింది. ఇది కోర్టు వివాదానికి కూడా దారి తీసింది.

గుండె నొప్పికి దారి తీసిన కార‌ణాలు:

అయితే తాజా స‌మాచారం మేర‌కు... సంజ‌య్ క‌పూర్ సహజ కారణాల వల్ల మరణించారని బ్రిటిష్ వైద్య అధికారులు ఆదివారం ఆయన భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్‌కు రాసిన లేఖలో తెలిపారు. సర్రే కరోనర్ కార్యాలయం దర్యాప్తులో సంజ‌య్ సహజ కారణాల వల్ల మరణించాడని వెల్లడైందని ద‌ర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఎడమ జఠరిక హైపర్ట్రోఫీ - ఇస్కీమిక్ గుండె జబ్బుకు కార‌ణ‌మై మరణానికి దారి తీసింద‌ని వారు తెలిపారు. గుండె ఎడమ జఠరిక కండరాల గోడ చిక్కగా మారే స్థితి వ‌ల్ల‌ రక్తం సమర్థవంతంగా పంప్ చేయడం కష్టమవుతుంది. గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు లేదా అధిక రక్తపోటు కారణంగా ఈ పరిస్థితి ఎదుర‌వుతుంది. ఈ ప‌రిణామాలు కరోనరీ ఆర్టరీ వ్యాధికి దారి తీస్తాయి.. సారణంగా ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండె కండరాలకు తగినంత రక్తం - ఆక్సిజన్ అందదు. ధ‌మ‌ని గోడ‌లో కొవ్వు పేరుకు పోవ‌డంతో స‌మ‌స్య ఉధృత‌మ‌వుతుంది. దీని దృష్ట్యా కరోనర్స్ అండ్ జస్టిస్ యాక్ట్ 2009లోని సెక్షన్ 4 ప్రకారం ఇప్పుడు దర్యాప్తును నిలిపేశారు... విచారణ అవసరం ఉండదని కరోనర్ కార్యాలయం తెలిపింది.

రాంగ్ గేమ్ లేనే లేదు:

ఈ ప్ర‌క‌ట‌న అనంత‌రం ప్రియా స‌చ్ దేవ్ కి క్లీన్ చిట్ వ‌చ్చింది. ప్రియా స‌చ్ దేవ్ తర‌పు బంధువులు మాట్లాడుతూ ఇందులో ఎలాంటి త‌ప్పుడు ఆట (రాంగ్ గేమ్ ) లేద‌ని వ్యాఖ్యానించారు. సంజ‌య్ క‌పూర్ మ‌ర‌ణంపై రాణి క‌పూర్ కి నిజా నిజాలేమిటో ఇప్పుడు స్ప‌ష్ఠంగా తెలిసాయని పేర్కొన్నారు. `అంత‌ర్జాతీయ కుట్ర` అంటూ రాణీ క‌పూర్ చేసిన ఆరోప‌ణ‌ల్లోను నిజం లేద‌ని తాజా విచార‌ణ‌లో అంతిమంగా అధికారులు తేల్చారు.

Tags:    

Similar News