సందీప్ కిషన్.. ట్రాక్ మార్చినట్లు ఉన్నారే..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ కెరీర్ లో కనపడుతున్న బిగ్ ఛేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ కెరీర్ లో కనపడుతున్న బిగ్ ఛేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, మధ్యలో కొంత స్లో అయినప్పటికీ ఇప్పుడు సరైన ప్లాన్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ, తన ట్రాక్ ను పూర్తిగా మార్చినట్లుగా కనిపిస్తోంది.
ఇటీవల మంచి విజయం సాధించిన శంబాల చిత్ర దర్శకుడు ఉగంధర్ మునితో సందీప్ కిషన్ చేతులు కలపడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ కాంబినేషన్ లో సోషియో-ఫాంటసీ జానర్ లో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఆ చిత్రాన్ని నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించనుండగా.. కంటెంట్ పరంగా స్ట్రాంగ్ కథతో రానుందని టాక్.
అదే సమయంలో సందీప్ కిషన్ లైనప్ లో ఉన్న మరో ఆసక్తికర ప్రాజెక్ట్ పవర్ పేట. ఆ చిత్రాన్ని కృష్ణ చైతన్య తెరకెక్కించనున్నారు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలతో తనదైన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న కృష్ణ చైతన్య.. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో పవర్ పేటపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సిగ్మా ప్రాజెక్ట్ కూడా సందీప్ కిషన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఆ చిత్రానికి దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ గా రానున్న ఆ సినిమా 2026 వేసవిలో విడుదల కానుందని సమాచారం. సందీప్ ఇలాంటి జోనర్ లో నటించడం తొలిసారని తెలుస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అలా వరుసగా భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న సందీప్ కిషన్, కెరీర్ లో కొత్త ట్రాక్ ను ఎంచుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్న జోనర్లలో తన టాలెంట్ చూపించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో స్నేహగీతం, ప్రస్థానం వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన సందీప్ కిషన్, కెరీర్ ప్రారంభంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, తెనాలి రామకృష్ణ బీఎ బీఎల్ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నప్పటికీ, మధ్యలో కొన్ని చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు కథల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్న సందీప్ కిషన్, మళ్లీ విజయాల బాట పట్టేలా కనిపిస్తున్నారు. మొత్తానికి కంటెంట్ కు ప్రాధాన్యం ఇస్తూ, కొత్త తరహా కథలను ఎంచుకుంటున్న సందీప్ కిషన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..