సమంత బిడ్డకు శ్రీచక్ర యంత్రంతో రక్షణ వలయం
ఈ వేడుకలో భాగంగా పూజారి (శ్రీవిద్య ఉపాసకుడు) ప్రతి దశను ఎంతో అర్థవంతంగా వివరించినట్లు తెలిపారు.
సమంత రూత్ ప్రభు సీమంత వేడుక సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన సంప్రదాయాలపై తనకు ఎప్పుడూ గాఢమైన గౌరవం ఉందని చెబుతూ.. ప్రతి ఆచారం వెనుక ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని నమ్ముతున్నట్టు సమంత తెలిపారు. మంత్రాల ద్వారా, పురాతన పద్ధతుల ద్వారా ఉద్భవించే ఆ శక్తి తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
ఈ వేడుకలో భాగంగా పూజారి (శ్రీవిద్య ఉపాసకుడు) ప్రతి దశను ఎంతో అర్థవంతంగా వివరించినట్లు తెలిపారు. ముఖ్యంగా శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన `కాలా ఆవరణ (శ్రీ కల్పం)` అనే ప్రత్యేక పూజా విధానం ద్వారా కాబోయే తల్లిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి శక్తిని అందించే ఘట్టం అత్యంత ప్రధానమైనది. అమ్మవారి 94 కళలను.. కాబోయే తల్లిలోని ఏడు చక్రాలను ఈ పవిత్ర జలాలతో శుద్ధి చేసే ఈ ఆచారం ద్వారా తనలో దైవిక శక్తిని జాగృతం చేస్తారు.
ఈ ఆచారంలో మాతృత్వాన్ని చూసే విధానం తనను ఎంతగానో కదిలించిందని సమంత వెల్లడించారు. తల్లిని సాక్షాత్తు దేవిలా.. మరో ప్రాణానికి రూపమిచ్చే సృష్టికర్తగా ఈ వేడుకలో గౌరవిస్తారు. అభిషేకం ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణంలోని తొమ్మిది దశలను సూచించే శ్రీ చక్ర యంత్రం మధ్యలో సమంతను కూర్చుండబెట్టారు. ఆ యంత్రం మధ్యలో ఉండే బిందువు సృష్టికి మూలమైన లలితా త్రిపురసుందరి రూపాన్ని సూచిస్తుంది.
దేవి ఖడ్గమాలా పఠన సమయంలో తొమ్మిది ఆవరణలకు సంబంధించిన దేవతల పేర్లను జపించడం ద్వారా మనసును లోపలికి మళ్లించి రక్షణను, ఆశీర్వాదాలను పొందే ఏర్పాటు చేశారు. ఈ మంత్రోచ్ఛారణ తల్లి- బిడ్డ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచి.. పుట్టబోయే బిడ్డకు పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందిస్తుందని నమ్ముతారు. తన కోసం తన బిడ్డ కోసం ఆ సమయంలో ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటూ అక్కడ కూర్చోవడం తనకు ఎంతో శక్తివంతమైన అనుభూతినిచ్చిందని సామ్ తెలిపారు.
ఈ వేడుక గురించి ముందస్తు అవగాహన పెద్దగా లేకపోయినా.. ఎంతో పవిత్రమైన వాతావరణంలో ఈ అనుభూతిని పొందడం తనకు రక్షణనిచ్చిందని సమంత పేర్కొన్నారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని తనకు అందించిన తన ప్రియమైన శిల్పకు.. ఈ పవిత్ర వాతావరణాన్ని సృష్టించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మన సంప్రదాయాలలోని జ్ఞానానికి.. తాను మారుతున్న ఈ మాతృత్వపు దశకు.. తనను చేరిన చిన్నారి ప్రాణానికి నమస్కరిస్తూ సమంత తనలోని మనోభావాలను షేర్ చేసుకున్నారు.