సామ్ పెళ్లాడిన నాలుగు రోజుల‌కే..

వ‌ర్క్ కమిట్‌మెంట్ విష‌యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు రాజీ అన్న‌దే లేకుండా ప‌ని చేస్తుంటారు. ప‌నే దైవం అనే బాప‌తు వీళ్లంతా.;

Update: 2025-12-06 03:46 GMT

వ‌ర్క్ కమిట్‌మెంట్ విష‌యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు రాజీ అన్న‌దే లేకుండా ప‌ని చేస్తుంటారు. ప‌నే దైవం అనే బాప‌తు వీళ్లంతా. స‌మయానికి సెట్స్ కి హాజ‌రు కావ‌డం, స‌న్నివేశం కోసం ఎదురు చూసే పంక్చువాలిటీ, విధి విధానాల విష‌యంలో ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌టం, ఎంపిక చేసుకున్న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఫిట్ నెస్ మెయింటెయిన్ చేయ‌డం ఇవ‌న్నీ కొంద‌రికే సాధ్యం. అలాంటి గొప్ప క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వారు సుదీర్ఘ కాలం ఈ రంగంలో స్టార్లుగా కొన‌సాగుతారు.

పై అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న న‌టి స‌మంత రూత్ ప్ర‌భు. రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో సామ్ గురించి ఏనాడూ ఫిర్యాదులే లేవు. సెట్స్ కి ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని కానీ, అదుపు త‌ప్పి బ‌రువు పెరిగింద‌నో లేదా క్ర‌మ‌శిక్ష‌ణ తెలియ‌ద‌ని త‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఏనాడూ ఫిర్యాదులు చేయ‌లేదు.

ఇప్పుడు రాజ్ నిడిమోరుతో పెళ్ల‌యిన నాలుగో రోజుకే సామ్ తిరిగి సెట్స్ కి హాజ‌ర‌వ్వ‌డం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వ‌ర్క్ డెడికేష‌న్ అంటే ఇది క‌దా! అంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. గ‌తంలో ప‌రిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా స‌హా ప‌లువురు తార‌లు ఈ త‌ర‌హాలోనే పెళ్ల‌యిన కొద్దిరోజుల‌కే సెట్స్ కి హాజ‌రై ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అదే త‌ర‌హాలో ఇప్పుడు స‌మంత కూడా పెళ్ల‌యాక‌ నాలుగు రోజుల్లోనే త‌న వ‌ర్క్ క‌మిట్మెంట్ కోసం సిద్ధ‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

డిసెంబర్ 1న చిత్రనిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న కొద్ది రోజులకే సమంత రూత్ ప్రభు `మా ఇంటి బంగారం` షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో తన వానిటీ వ్యాన్ నుండి తీసిన ఒక ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు సామ్. ప్ర‌స్తుతం ఇది ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. అక్క‌డ ఒక‌ మేకప్ చైర్‌లో కూర్చుని, దర్శకురాలు నందిని రెడ్డి , మేకప్ ఆర్టిస్ట్ అవ్ని రాంబియాతో స‌ర‌దాగా చాట్ చేస్తూ క‌నిపించింది. చాలా సింపుల్ గా కాజువల్ టీ-షర్ట్ - జీన్స్‌లో క‌నిపించిన సామ్ ఇది `మా ఇంటి బంగారం` సెట్స్ నుంచి అని వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలో త‌న చేతులు, కాళ్ళపై పెళ్లి మెహందీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. నవంబర్ 30న సమంత - రాజ్ వివాహం గురించి ఊహాగానాలు మొద‌ల‌వ్వ‌గా, కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో ఈ వివాహం జ‌రిగింది. మరుసటి రోజు ఉదయం లింగ భైరవి సమీపంలో నిర్వహించిన భూత శుద్ధి వివాహ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ పెళ్లికి నందిని రెడ్డి, శిల్పా రెడ్డి, క్రేషా బజాజ్ త‌దిత‌ర సన్నిహితులు హాజరయ్యారు. మా ఇంటి బంగారం చిత్రానికి నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంవ‌హిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News