రిస్క్ కు ఎప్పుడూ వెనుకాడను
సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.;
ఏ మాయ చేసావే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి తర్వాత సౌత్ లోని హీరోలందరితో వరుసపెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన సమంత, రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంటరైన విషయం తెలిసిందే. నటిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా కూడా మారింది సమంత.
సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే శుభం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సమంత నిర్మించిన సినిమా కావడం, దానికి తోడు శుభంలో సమంత కూడా ఓ గెస్ట్ రోల్ చేయడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే శుభం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత, నిర్మాతగా తాను తీసుకున్న రిస్క్ గురించి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉంటూ సినిమాపై మంచి అభిరుచి, ప్రేమ పెరగడం వల్ల భయం పోయిందని, నిర్మాతగా ఉండటం రిస్క్ అయినప్పటికీ రిస్క్ తీసుకోకపోతే మార్పు రాదని, తానెప్పుడూ రిస్క్ తీసుకోవడానికి రెడీ గానే ఉంటానని సమంత తెలిపింది.
తన కెరీర్లో ఎన్నో రిస్క్‌లు చేశానని, వాటిలో చాలా వరకు ఫలించాయని చెప్పిన సమంత, 15 ఏళ్లుగా సినిమాల గురించి, ఆడియన్స్ కు ఎలాంటి కథలు చెప్పాలనే విషయంపై కొంత పట్టు సాధించానని తనకు నమ్మకమొచ్చాకే సినీ నిర్మాణంలోకి దిగానని, తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ వెనుక మంచి టీమ్ ఉందని, ఈ సినిమా కోసం టీమ్ మొత్తం తమ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టామని, తమ పనికి మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చింది.
అయితే నటిగా ఉండటానికీ, నిర్మాతగా వ్యవహరించడానికీ చాలా తేడా ఉందని చెప్తున్న సమంత, నటిగా ఉంటే కేవలం తన పని వరకు తాను నిర్వర్తిస్తే చాలని, కానీ నిర్మాతగా ఉంటే సినిమాలోని ప్రతీ క్రాఫ్ట్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుదని, శుభం సినిమాతో తాను చాలా నేర్చుకున్నానని, ఇప్పుడే ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయినందున ముందు ముందు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తాను తెలిపింది.
నిర్మాతగా తాను ఫలానా జానర్ సినిమాలే తీయాలని కట్టుబడి కూర్చోలేదని, అన్ని రకాల జానర్లలో సినిమాలు చేసి, అందరినీ మెప్పించాలని చూస్తున్నట్టు సమంత తెలిపింది. కానీ ఒక మహిళగా తనకు ఎలాంటి కథకు నచ్చుతాయో, ఎలాంటి కథలను తాను ఆడియన్స్ కు చెప్పాలనుకుంటున్నానో అవే తన నిర్మాణంలో సినిమాలను నిర్ణయిస్తాయని సమంత చెప్పింది.