పిల్ల‌లు పుట్టినా..పుట్ట‌క‌పోయినా ప‌ర్వాలేద‌నుకున్నాం?

నటి సమంత వ్యక్తిగత జీవితం -మాతృత్వం గురించి ఇటీవల ఓ మీట్ లో ఎంతో పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-09-10 10:15 GMT

నటి సమంత వ్యక్తిగత జీవితం -మాతృత్వం గురించి ఇటీవల ఓ మీట్ లో ఎంతో పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశారు. భ‌ర్త‌ రాజ్ నిడిమోరుతో కలిసి మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న స‌మంత‌ పిల్లల విషయంలో తమకున్న ఆలోచనా విధానాన్ని పంచుకున్నారు. జీవితంలో ప్రశాంతత, అన్యోన్యత ముఖ్యమని నమ్మే త‌న‌కు గర్భధారణ అపారమైన సంతోషాన్ని ఇచ్చిన మలుపు అని సామ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈనేప‌థ్యంలో దంపతుల మైండ్‌సెట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. `ఒకానొక దశలో నేను, రాజ్ ఇద్దరం కూడా పిల్లలు ఉన్నా లేకపోయినా ఓకే అనే భావనకు వచ్చాం. పిల్లలు కలిగినా సరే? కలగకపోయినా సరే? జీవితం రాజ్ నిడిమోరుతో అంతా సవ్యంగానే ఉంటుందని ముందే నిర్ణయించుకున్నాం. ఇద్దరి మధ్య బంధం, అర్థం చేసుకునే తత్వమే ప్రధానమని భావించాం` అన్నారు. అయితే ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే అనూహ్యంగా గర్భం దాల్చడంతో తమ జీవితం మరింత సంతోషమయంగా మారిందని సమంత ఆనందం వ్యక్తం చేశారు.

పిల్లలు లేకపోయినా ఒకరికొకరం తోడుగా జీవితాన్ని ఆస్వాదించవచ్చని అనుకున్న తరుణంలో ఈ వార్త తమ ఇంట మరింత వెలుగులు నింపిందన్నారు. ఈ సర్‌ప్రైజ్ తమ బంధాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లిందన్నారు. స‌మంత షూటింగ్ సమయంలోనే విషయం తెలిసిందని ఆరంభంలో కొంత నీరసంగా ఉన్నా? వృత్తిపరమైన కట్టుబాట్లను ఉత్సాహంగా పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. మాతృత్వంలోకి అడుగుపెడుతున్న వేళ ఆడపిల్ల లేదా మగపి ల్లవాడు అనే తేడా లేకుండా రాబోయే చిన్నారిని ఆహ్వానించేందుకు తాము ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ మార్పు తమ జీవితంలో సరికొత్త అనుభూతులను తెస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.

సమంత- రాజ్ నిడిమోరు కాంబినేషన్‌లో `ది ఫ్యామిలీ మ్యాన్ 2`, `సిటాడెల్: హనీ బన్నీ` వంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. వృత్తిపరమైన పరిచయం ప్రేమ‌గా మారి వివాహబంధంతో ఒకటైన జంట ఇటు కెరీర్‌ను అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ గా నడిపిస్తున్నారు. ప్రస్తుతం స‌మంత కొత్త సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు.

పిల్లల విషయంలో సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గకుండా దంపతులిద్దరి అవగాహనే ముఖ్యమని నిరూపించిన సమంత-రాజ్‌ల దృక్పథంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జీవితం ఇచ్చే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే నిజమైన సంతోషమని సమంత వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.

Tags:    

Similar News