సామ్ 'బంగారం'.. సరైన డేట్ ఫిక్స్ చేసినట్లు ఉన్నారే..
ఆ పోస్టర్ లో సమంత రెడ్ కాటన్ చీరలో చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్ లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఆ సినిమాను సామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్లతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ముఖ్యంగా సమంత ఇందులో గృహిణి పాత్రలో కనిపిస్తూనే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లలో నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
మొదట ఆ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అప్పటికే ఐపీఎల్ సీజన్ పీక్ లో ఉండటంతో థియేటర్లకు ఆడియన్స్ రాక తగ్గే అవకాశం ఉందని భావించిన మూవీ టీమ్ రిలీజ్ ను వాయిదా వేసింది. తాజాగా జూన్ 19న సినిమాను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఆ పోస్టర్ లో సమంత రెడ్ కాటన్ చీరలో చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్ లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ గృహిణిలా కనిపించే మహిళ పరిస్థితులు మారితే ఎంత డేంజర్ గా మారుతుందో అనే యాంగిల్ ను పోస్టర్ ద్వారా హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్, పోస్టర్ రెండూ సినిమాకు మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెంచుతున్నాయి.
ఇక రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మంచి ప్లానింగ్ తో ముందుకెళ్లినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే అప్పటికి ఐపీఎల్ ముగియనుండటం పెద్ద ప్లస్ గా మారనుంది. మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కూడా షూటింగ్ ఆలస్యాల కారణంగా జూన్ 4కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయ్యే సమయానికి మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పోటీ కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది.
అందుకే బాక్సాఫీస్ పరంగా జూన్ మూడో వారం సరైన టైమింగ్ అని మేకర్స్ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ టచ్ ఉండటంతో ఆ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శుభం సినిమాలో క్యామియో తర్వాత సమంత పూర్తి స్థాయి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఇదే కావడం మరో విశేషం.
కథ విషయానికి వస్తే.. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఓ యువకుడు పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుని భార్యను ఇంటికి తీసుకొస్తాడు. అయితే అమాయకంగా కనిపించే ఆ యువతి తన కుటుంబాన్ని శత్రువుల నుంచి రక్షించేందుకు ఎలా పోరాడింది? అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినట్లు సమాచారం. మూవీలో సమంతతో పాటు గుల్షాన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా మా ఇంటి బంగారం కోసం మేకర్స్ ఎంచుకున్న రిలీజ్ డేట్ నిజంగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.