నా గదిలో నా వెంటే ఒక భూతం తిరిగేది.. కానీ హాని చేయదు.. ఒంటరి హీరో షాకింగ్ నిజం!
ఈ షోలో పాల్గొన్న ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో సల్మాన్ ఖాన్ ఉండే గది ఎంత చిన్నగా ఉంటుందో గుర్తుచేసుకున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం, నివాసం .. ఆసక్తికరమైన విషయాల గురించి తాజాగా `కాఫీ విత్ కరణ్ 9` షోలో షేర్ చేసిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముంబైలోని తన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న చిన్న గది గురించి మాట్లాడుతూ. అక్కడ తనకు ఎదురైన వింత- ఆశ్చర్యకరమైన అనుభవాలను అభిమానుల కోసం షేర్ చేసారు.
ఈ షోలో పాల్గొన్న ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో సల్మాన్ ఖాన్ ఉండే గది ఎంత చిన్నగా ఉంటుందో గుర్తుచేసుకున్నారు. సల్మాన్ అంతటి పెద్ద స్టార్ అయినా ఆ రోజుల్లో ఆయన కేవలం ఒక మంచం.. ఒక చిన్న అల్మారా మాత్రమే పట్టే అతి చిన్న గదిలో తన కుటుంబంతో కలిసి ఉండేవారని కరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ గదిని చూసి తాను మొదట్లో ఎంతగానో షాక్ అయ్యానని.. ఆయన సాదాసీదా జీవనశైలి తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
కరణ్ జోహార్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న తరుణంలో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. తాను ఆ గదిలో ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్లు భావించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ గదిలో తనతో పాటు ఎప్పుడూ మరో అదృశ్య శక్తి ఉండేదని.. అయితే తాను ఆ శక్తిని ఎప్పుడూ కళ్లతో చూడలేదని.. కేవలం అది అటూ ఇటూ తిరుగుతుంటే దాని ఉనికిని బలంగా అనుభవించానని తెలిపారు. గదిలో ఎవరూ లేకపోయినా తన వెనుక ఎవరో నిలబడినట్లు తనకు తరచూ అనిపించేదని పేర్కొన్నారు.
తాను ఆ గది నుంచి బయటికి రాగానే లైట్లు అంతట అవే ఆన్, ఆఫ్ అవ్వడం, అల్మారాలు వాటంతట అవే తెరుచుకోవడం.. మ్యూజిక్ సిస్టమ్ దానంతట అదే ఆన్ కావడంతో పాటు వింత శబ్దాలు వచ్చేవి అని సల్మాన్ వివరించారు. బాల్కనీలో లేదా బయట బిలియర్డ్స్ ఆడుతున్నప్పుడు కూడా గది లోపల నుంచి అప్పట్లో కొన్ని శబ్దాలు వినిపించేవని చెప్పారు. అయితే ఈ వింత అనుభవాలు తనను ఎప్పుడూ భయపెట్టలేదని.. ఆ శక్తి తనకు ఎలాంటి హాని చేయకపోవడంతో తాను దానితోనే సర్దుకుపోయానని సల్మాన్ సరదాగా చెప్పుకొచ్చారు.
ఇదే షోలో సల్మాన్ ఖాన్ కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా.. ఫోటోగ్రాఫర్లు మీద పడే సంస్కృతిలోని ఇబ్బందికర ధోరణులపై కూడా తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలను అసౌకర్యకరమైన కోణాల్లో ఫోటోలు తీయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది తారలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని పేర్కొన్నారు. గోప్యతకు భంగం కలిగించే ఈ పోకడలపై బాలీవుడ్లో మళ్లీ పెద్ద చర్చకు తెరలేపిన ఆయన.. తన రిలేషన్స్‌పై, అలాగే తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలపై కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.