గరివిడి లక్ష్మి జీవితంపై బయోపిక్: జానపద కళాకారుల హక్కులు- సినీ పరిశ్రమ నిర్లక్ష్యంపై మళ్లీ చర్చ!
ఉత్తరాంధ్ర మట్టి వాసనలను, అచ్చమైన జానపద కళలను ప్రపంచానికి చాటిన దివంగత ప్రముఖ బుర్రకథ - జానపద కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `గరివిడి లక్ష్మి`.
ఉత్తరాంధ్ర మట్టి వాసనలను, అచ్చమైన జానపద కళలను ప్రపంచానికి చాటిన దివంగత ప్రముఖ బుర్రకథ - జానపద కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `గరివిడి లక్ష్మి`. ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ చిత్ర ప్రాముఖ్యతను కొనియాడారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, జీవన విధానంపై వస్తున్న ఈ బయోపిక్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక హాట్ టాపిక్‌గా మారింది.
గరివిడి లక్ష్మి ఆలపించిన ఎన్నో అచ్చమైన పల్లెటూరి జానపద బాణీలను.. ఈల పాటలను గతంలో పలువురు ప్రముఖ సంగీత దర్శకులు తమ సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్‌కు స్ఫూర్తిగా, నేపథ్య సంగీతంగా (బీజీఎం) ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఈ జానపద గాయని గళం నుంచి జాలువారిన దాదాపు పదికి పైగా ఒరిజినల్ ట్యూన్స్ - జానపద బాణీలు టాలీవుడ్లో మార్మోగాయి. అయితే ఆ పాటలు వెనుక ఉన్న అసలు సృష్టికర్తను గుర్తించడంలో పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఇప్పటికీ బలంగా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో ఎంతో గొప్ప ప్రాచుర్యం పొందిన చాలా మాస్ సాంగ్స్ జానపద గీతాలు గరివిడి లక్ష్మి పాడిన పాపులర్ పాటలే మూలం. ``నళ్ళ జీలకర్ర మొగ్గ, కోసింది కొయ్యకూర, నా కడ పోయిందో నాటు కోడి.. వంటి అనేక ప్రాచుర్యం పొందిన బాణీలు 90లు మరియు 2000లలో ఆడియో మార్కెట్‌ను శాసించాయి. అప్పట్లో ఈ పాటలు మిలియన్ల కొద్దీ అమ్ముడై.. ఆడియో కంపెనీలకు.. సినిమాలకు కోట్లాది రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి. కానీ ఆ పాటలకు ప్రాణం పోసిన గరివిడి లక్ష్మికి మాత్రం ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరక్షరాస్యురాలైన ఆ కళాకారిణికి కాపీరైట్లు, రాయల్టీల గురించి కనీస అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. సినిమా రంగం ఈ జానపద పాటలను `పబ్లిక్ డొమైన్` లేదా ప్రజా బాణీలుగా భావించి.. ఎలాంటి అనుమతులు గానీ.. కనీస క్రెడిట్స్ గానీ ఇవ్వకుండా వాడుకుంది. కేవలం కొద్ది మొత్తపు పారితోషికానికే పరిమితం చేయడం లేదా అసలు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల దశాబ్దాలుగా ఆ కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం థియేటర్లలోకి వస్తున్న `గరివిడి లక్ష్మి` బయోపిక్ చిత్రం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా.. అణగారిన జానపద కళాకారుల గొంతుకగా నిలవనుంది. దశాబ్దాలుగా వెలుగు చూడని ఈ చేదు నిజాలను వెండితెరకు ఎక్కించడం ద్వారా గరివిడి లక్ష్మికి దక్కాల్సిన గౌరవాన్ని- గుర్తింపును అందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా ఇప్పటికైనా జానపద కళాకారుల హక్కులు, వారి సృజనాత్మకతకు దక్కాల్సిన రాయల్టీల అంశంపై సినీ పరిశ్రమలో, అలాగే చట్ట పరిధిలో న్యాయమూర్తుల సమక్షంలో ఒక నైతిక చర్చ మొదలుకావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే జానపద కళాకారులు తమకు రావాల్సిన రాయల్టీల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించాలో కూడా న్యాయవ్యవస్థను సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంది. క్రియేటివిటీని దోపిడీ చేసే హక్కు ఎవరికీ లేదనే నిజాన్ని నిరూపించాల్సి ఉంటుంది.