'సేవ్ ది టైగర్స్' దర్శకుడితో మూవీ.. మెగా మేనల్లుడి ప్లాన్ ఇదే..
మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ తన నెక్స్ట్ మూవీతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.
మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ తన నెక్స్ట్ మూవీతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమానుతో కలిసి సినిమా చేయబోతున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఆ మూవీపై అప్పుడే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
నిజానికి సాయిదుర్గా తేజ్ గత కొంతకాలంగా తన సినిమాలను స్పెషల్ గా సెలెక్ట్ చేస్తున్నారు. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా కొత్త స్టోరీలు, భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. విరూపాక్ష వంటి విభిన్నమైన కథతో విజయం అందుకున్న ఆయన.. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత కూడా కొత్త కథలతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు కొత్త మూవీ అనౌన్స్మెంట్ తో క్లియర్ గా తెలుస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోలు ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సాయిదుర్గా తేజ్ మాత్రం కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. తేజ కాకుమాను ఇప్పటివరకు నటుడిగా, వెబ్ సిరీస్ దర్శకుడిగా తన టాలెంట్ చూపించారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై తన ఆలోచనలను సినిమా రూపంలో చూపించనున్నారు.
తేజ కాకుమాను బాహుబలి వంటి చిత్రాల్లో నటించారు. అనంతరం సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఫన్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ తో సాగే స్టోరీని ఎంటర్టైనింగ్ గా చూపించడంలో ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పుడు సినిమా డైరెక్టర్ గా తన తొలి ప్రయత్నంలోనే సాయి దుర్గా తేజ్ తో వంటి హీరోతో వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. స్పెషల్ గా స్టోరీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కథలోని కొత్తదనం, తన రోల్ నచ్చడంతో సాయి దుర్గా తేజ్ ప్రాజెక్టుకు వెంటనే ఓకే చెప్పినట్లు మూవీ టీమ్ తెలిపింది. హీరోను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్ లో చూపించనున్నట్లు పేర్కొంది. అయితే స్టోరీ లైన్, హీరో రోల్, ఇతర క్యాస్టింగ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. అహోబిలం బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై అఫీషియల్ అప్డేట్ లేదు.
అనిల్ సుంకర నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. మిగిలిన క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ వివరాలను మూవీ టీమ్ త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టుతో థియేటర్స్ లో వచ్చేందుకు రెడీ అవుతూనే.. సాయిదుర్గా తేజ్ తన నెక్స్ట్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. మరి తేజ కాకుమాను తన తొలి సినిమా దర్శకత్వంలో మెగా హీరోను ఏ విధంగా చూపిస్తారో, ఆ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.