టీజర్ టాక్: తింగరి లాయరమ్మగా కీర్తి.. కేసు గెలుస్తుందా?

ఆ పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు మిస్కిన్ కనిపించనున్నారు. ఆయనతో కీర్తి చేసే వాదనలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నాయి.

Update: 2026-10-15 09:11 GMT

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మరోసారి లాయర్ రోల్ లో కనిపించనున్నారు. అయితే ఈసారి కోర్టులో సీరియస్‌ గా వాదించే న్యాయవాదిగా కాకుండా.. తన మాటలు, చేష్టలతో నవ్వులు పూయించే తింగరి లాయరమ్మగా అలరించనున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సత్యవాన్ సావిత్రి సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఇందులో కీర్తి కామెడీ టైమింగ్ మెప్పిస్తోంది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ మొదలైంది.

సత్యవాన్ సావిత్రిలో కీర్తి సురేశ్ సావిత్రి అనే యువతి పాత్రలో నటిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పెద్ద లాయర్ కావాలని కలలు కనే ఆమె.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా కష్టపడి న్యాయవిద్య పూర్తి చేస్తుంది. అయితే కోర్టులో కేసులు వాదించే సమయంలో ఆమె చేసే పనులు, చెప్పే మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ముఖ్యంగా జడ్జిల ముందు ఆమె చేసే వాదనలు నవ్వులు పూయించేలా ఉన్నాయి.

'సావిత్రి పిచ్చి మొదలైంది' అనే క్యాప్షన్‌ తో విడుదలైన టీజర్‌ లో ఆ విషయాలను చూపించారు. సాధారణంగా కోర్టు నేపథ్యంలో వచ్చే సినిమాల్లో న్యాయం కోసం పోరాటం, న్యాయవాదుల మధ్య వాదనలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో ఆ కథకు కామెడీని యాడ్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సావిత్రి తనకు స్ఫూర్తిగా భావించే సీనియర్ లాయర్ మార్కండేయతో కోర్టులో తలపడాలని కోరుకుంటుంది.

ఆ పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు మిస్కిన్ కనిపించనున్నారు. ఆయనతో కీర్తి చేసే వాదనలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నాయి. అయితే సావిత్రి తన తొలి కేసులో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుంది, తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా పెళ్లయిన ఆమె జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా కథలో భాగంగా ఉండనున్నాయి. టీజర్‌ లో ఎక్కువగా కామెడీ సన్నివేశాలను చూపించిన మూవీ టీమ్ .. అసలు కేసు వెనుక ఉన్న విషయాలను మాత్రం బయటపెట్టలేదు.

దీంతో సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే వాశి సినిమాలో లాయర్‌ గా కనిపించిన కీర్తి సురేశ్.. మరోసారి రోల్ ను మళ్లీ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈసారి పూర్తిగా భిన్నమైన కామెడీ పాత్రలో కనిపించడం విశేషం. ఇటీవల డోరతీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ప్రస్తుతం విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న సత్యవాన్ సావిత్రిలో చారుకేశ్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, బాలాజీ శక్తివేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్, డ్రమ్‌ స్టిక్స్ ప్రొడక్షన్స్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 20న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి తింగరి లాయరమ్మ పాత్రతో కీర్తి ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

Full View
Tags:    

Similar News