గ్లోబల్ వర్సెస్ లోకల్: ఆడియన్స్ ట్రెండ్స్‌లో భారీ మార్పులు

ద‌శాబ్ధాల కాలంగా సూప‌ర్ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న బాలీవుడ్ దిగ్గ‌జ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఉన్నా `7 డాగ్స్` అనే సౌదీ చిత్రం దారుణంగా వైఫ‌ల్యం చెంద‌డం.. కేవ‌లం ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు సాధించ‌డంపై చాలా చ‌ర్చ సాగుతోంది.

Update: 2026-08-23 18:33 GMT

ద‌శాబ్ధాల కాలంగా సూప‌ర్ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న బాలీవుడ్ దిగ్గ‌జ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఉన్నా `7 డాగ్స్` అనే సౌదీ చిత్రం దారుణంగా వైఫ‌ల్యం చెంద‌డం.. కేవ‌లం ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు సాధించ‌డంపై చాలా చ‌ర్చ సాగుతోంది. ఎలాంటి భారతీయ స్టార్స్ లేని హాలీవుడ్ చిత్రాలు ది ఒడిస్సీ, స్పైడ‌ర్ మేన్ బ్రాండ్ న్యూ డే చిత్రాలు వంద‌ల కోట్లు ఎలా కొల్లగొడుతున్నాయి? భారతీయ ప్రేక్షకులు నటుల కంటే కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది నిరూపిస్తోందా? అంటే అవున‌నే నిరూప‌ణ అవుతోంది.

భారతీయ సినిమా విపణిలో ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయని చెప్పడానికి ఇటీవల వెలువడిన బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసిన సౌదీ అరేబియన్ చిత్రం `7 డాగ్స్`బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 6 నుండి 10 లక్షల వసూళ్లతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అదే సమయంలో ఎలాంటి భారతీయ నటులు లేని `ది ఒడిస్సీ`, `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` వంటి హాలీవుడ్ చిత్రాలు 200 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించాయి. ఈ వ్యత్యాసం కేవలం ఒక సినిమా జయపజయాలకు మాత్రమే పరిమితం కాకుండా.. గ్లోబల్ వర్సెస్ లోకల్ ఆడియన్స్ ట్రెండ్స్‌లో వస్తున్న మార్పులను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.

గతంలో పెద్ద స్టార్ హీరో స్క్రీన్ పై ఒక్క నిమిషం కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. అయితే `7 డాగ్స్` విషయంలో ఆ మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేదు. సినిమాలో మెయిన్ లీడ్ నటులు ఎవరో తెలియకపోవడం.. కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో సల్మాన్, సంజయ్ దత్ ల పోస్టర్ ప్రచారం కూడా వసూళ్లను కాపాడలేకపోయింది. అగ్ర కథానాయకుల ఇమేజ్‌ను కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుని.. నాసిరకం లేదా పరిచయం లేని కంటెంట్‌ను అందిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారనే నిజానికి ఈ సినిమా ఫలితమే నిదర్శనంగా మారింది.

మరోవైపు హాలీవుడ్ చిత్రాలు భారతీయ మార్కెట్‌లో ఊహించని రీతిలో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ది ఒడిస్సీ , స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే వంటి సినిమాలు కథాంశం.. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో భారత్‌లో ఘనవిజయం సాధించాయి. ఎలాంటి లోకల్ స్టార్స్ సపోర్ట్ లేకపోయినా కేవలం కంటెంట్ బలం.. లీనమయ్యే విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగానే భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రాలకు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు కట్టబెట్టారు. వినోదంలో నాణ్యత ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని ఈ ఫలితాలు నిరూపించాయి. సౌదీ సినిమా కేవ‌లం చిన్న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. మునుముందు స్టార్ డ‌మ్, ప్రాంతీయ‌త‌తో ప‌ని లేకుండా కంటెంట్ ఏల్తుంద‌న‌డానికి చాలా ప్రూఫ్ లు క‌నిపిస్తున్నాయి.

ఈ పరిణామాలు భారతీయ ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. నేటి ఆడియన్స్ కేవలం స్టార్ పవర్ చూసి థియేటర్లకు రావడం లేదు..కథాంశం, గ్రాఫిక్స్ .. మేకింగ్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. పఠాన్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో వచ్చిన అతిథి పాత్రలకు ఉన్న క్రేజ్.. సరైన గుర్తింపు లేని విదేశీ చిత్రాల్లో కనిపించే క్యామియోలకు రాదని సల్మాన్ ఖాన్ అభిమానులు కూడా గ్రహించారు. దీంతో స్టార్ హోదా కంటే కంటెంట్‌కే అత్యున్నత ప్రాధాన్యత ఉందని పరిశ్రమకు స్పష్టమైన సందేశం వెళ్ళింది.

ఈ బాక్సాఫీస్ ఫలితం సల్మాన్ ఖాన్ త‌దుప‌రి చిత్రాలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న స‌ల్మాన్ తదుపరి భారీ చిత్రం 'మాన్‌స్టర్` విషయంలో అభిమానులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. కథాంశం - మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పక్కా కంటెంట్‌తో రావాలని, అవసరమైతే స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద నటుల పేర్ల కంటే స్ట్రాంగ్ కంటెంట్ -విజువల్ గ్రాండ్‌నెస్ మాత్రమే నిలబడతాయని `7 డాగ్స్`.. హాలీవుడ్ చిత్రాల ట్రెండ్ నిరూపించింది.

Tags:    

Similar News