పాపం.. హిట్ జోడీపై అప్పుడే పుకార్లు మొదలు
బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది.;
బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 'దిలవాలే దుల్హనియా లే జాంగే' వంటి సినిమాగా నాలుగు వారాల ముందు విడుదలైన 'సయ్యార' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అహాన్ పాండే, అనిత్ పడ్డ జంటగా నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. లిమిటెడ్ బడ్జెట్‌తో, అంతా కొత్త వారితో రూపొందిన సయ్యార సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మేకర్స్ సైతం ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. ఇప్పటి వరకు అనధికారిక లెక్కల ప్రకారం సయ్యార సినిమా రూ.500 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. హిందీలోనే కాకుండా ఈ సినిమా ఇతర భాషల్లోనూ డబ్ చేస్తే బాగుండేదని కొందరు అంటున్నారు.
సయ్యారతో అహాన్ పాండే, అనిత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్
హిందీ వర్షన్ నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ ఆడుతోంది. ఈ హిట్ సినిమాలో నటించడం ద్వారా అహాన్ పాండే, అనిత్ పడ్డాలు ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు. వారిద్దరూ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సయ్యార సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అహన్ పాండే, అనిత్ పడ్డాలు కొత్తగా సినిమాలకు కమిట్ కాలేదు. ముందు ముందు వారి నుంచి పెద్ద సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇద్దరూ కలిసి మళ్లీ నటించాలని, వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ సినిమాలు రావాలని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. ఇదే సమయంలో వీరిద్దరు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
సక్సెస్ పార్టీలో సీక్రెట్ మీటింగ్
సయ్యార సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అహాన్ పాండే, అనిత్ పడ్డా లు గత నెల రోజులుగా కలిసి తిరుగుతున్నారు. ఇద్దరూ రెగ్యులర్‌గా మీడియా ముందు కనిపిస్తున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ పార్టీల్లోనూ రెగ్యులర్‌గా పాల్గొంటున్నారు. ఇటీవల ఒక సక్సెస్ పార్టీలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోల్లో వారిద్దరూ నార్మల్‌గా ఉండి ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ ఆ పార్టీలో ఇద్దరూ చాలా క్లోజ్‌గా కనిపించారు. అంతే కాకుండా ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడం, అందరికీ కాస్త దూరంగా ఉంటూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే వీరిద్దరి మధ్య కొత్త కెమిస్ట్రీ ఏమైనా మొదలైందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అహాన్, అనిత్‌ల ప్రేమ పుకార్లపై స్పందన
సోషల్ మీడియాలో వీరి వీడియోలను షేర్ చేస్తూ కొందరు లవ్ నడుస్తున్నట్లుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అందులో తప్పేం లేదు, ఇద్దరి జోడీ బాగుంది, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో కలిసి ముందుకు సాగాలి అనుకోవడం తప్పేం లేదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అని వారి సన్నిహితులు అంటున్నారు. వారు ఇప్పుడే కెరీర్ ప్రారంభించారు. ఇంతలోనే ఇలాంటి పుకార్లు వారి గురించి రావడం దారుణం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం వారు ఇద్దరూ చాలా చిన్న పిల్లలు, వారి గురించి అలాంటి పుకార్లు వస్తాయని అనుకోలేదని ఇండస్ట్రీకి చెందిన ఒక దర్శకుడు మీడియాతో మాట్లాడిన సందర్భంలో అన్నాడు. ఈ పుకార్ల గురించి అహాన్, అనిత్ లు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.