బేబీ ఇప్పుడొస్తే సగం షేర్ కూడా రాదా? డైరెక్టర్ అలా అన్నారేంటి ?

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎంత వేగంగా మారుతున్నాయనేది దర్శకుడు సాయి రాజేష్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి.

Update: 2026-05-27 11:26 GMT

టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎంత వేగంగా మారుతున్నాయనేది దర్శకుడు సాయి రాజేష్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు కల్ట్ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన బేబీ మూవీ.. ఇప్పుడు రిలీజ్ అయితే అంతటి రేంజ్ సక్సెస్ ను అందుకోలేదని ఆయన వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేట్ కు కారణమైంది. అసలేం జరిగింది? సాయి రాజేష్ ఎందుకు అలా అన్నారు?

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మాస్టర్ రోహన్‌, అరుణ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సమ్మర్ హాలీడేస్ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొని సాయి రాజేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ఇప్పుడు చాలా భయం వేస్తోంది. ఇలా కొనసాగితే ఏ కథలు రాయాలి.. ఏ సినిమాలు తీయాలి అన్న సందేహం వస్తోంది. రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి కొన్ని జోనర్లను మనమే చంపేశాం" అంటూ అభిప్రాయపడ్డారు. బేబీ సినిమా ఈరోజుల్లో వస్తే సగం షేర్ కూడా రాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే సాయి రాజేష్ చేసిన కామెంట్స్ వెనుక ఇండస్ట్రీలో వేగంగా మారుతున్న ఆడియన్స్ మైండ్‌ సెట్ క్లియర్ గా కనిపిస్తోంది. ఒకప్పుడు కంటెంట్‌, ఎమోషన్స్‌ తో నడిచిన చిన్న సినిమాలు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్‌, ఓటీటీ ప్రభావం, షార్ట్ వీడియో కల్చర్ కారణంగా మొదటి వారానికే పరిమితమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యూత్ టేస్ట్ చాలా వేగంగా మారిపోవడం వల్ల ప్రేమకథలకు కూడా కొత్త ట్రీట్మెంట్ అవసరమైందని టాక్ వినిపిస్తోంది.

బేబీ సినిమా విడుదలైనప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ చిత్రం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలై భారీ సంచలనంగా మారిన ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా షేర్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

మొదటి రోజే రూ.3 కోట్లకు పైగా షేర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించడంతో పాటు ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే సినిమాను ఉదాహరణగా తీసుకుని సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఉన్న ఆందోళనను బయటపెడుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం, వేగం, హై ఎంగేజ్మెంట్ ఉన్న కథలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీలకూ ఇప్పుడు స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లే, వైరల్ అయ్యే కంటెంట్ తప్పనిసరిగా మారుతోంది.

అయితే దర్శకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్.. హృదయ కాలేయంతో కల్ట్ కామెడీని అందించగా, బేబీతో యూత్ ఎమోషన్స్‌ ను స్ట్రాంగ్ గా చూపించారు. ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు సినిమా తీయడానికే భయమేస్తోందనడం.. టాలీవుడ్‌ లో కంటెంట్ ట్రెండ్ ఎంత వేగంగా మారిందో క్లియర్ గా చెబుతోంది.

Tags:    

Similar News