హీరో.. డైరెక్ట‌ర్.. ప్రొడ్యూస‌ర్! రిషబ్ కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

రిషబ్ శెట్టి కెరీర్‌ను పరిశీలిస్తే, వేగం కంటే క్వాలిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Update: 2026-07-08 05:26 GMT

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చాలా మంది నటులు వరుస సినిమాలతో బిజీ అయిపోతారు. అయితే రిషబ్ శెట్టి మాత్రం ఆ రూట్‌లో కాకుండా తన కెరీర్‌ను పూర్తి భిన్నంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా భారీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, డైరెక్ట‌ర్ గా తన బాధ్యతలను పక్కన పెట్టకుండా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి చేతిలో రెండు భారీ సినిమాలున్నాయి. ముందుగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమాను పూర్తి చేయనున్న ఆయన, త‌ర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్‌పై పూర్తిగా దృష్టి సారించనున్నారు. ఈ రెండు సినిమాల‌కు భిన్నమైన బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్, స్పెష‌ల్ ప్రిపరేషన్ అవసరం కావడంతో వాటి షూటింగ్‌ను ఒకేసారి నిర్వహించే ఆలోచన లేదని తెలుస్తోంది. ప్రతి పాత్రకు తగిన సమయం కేటాయించాలనే నిర్ణ‌యంతో ఆయన అడుగులు వేస్తున్నారు.

అయితే నటుడిగా బిజీ షెడ్యూల్ ఉన్నా, త‌న‌లోని క్రియేటివిటీకి మాత్రం రిష‌బ్ రెస్ట్ ఇవ్వడం లేదు. తనకు, త‌న మ‌నసుకు ఎంతో దగ్గరైన కాంతార ఫ్రాంచైజీ తదుపరి భాగానికి సంబంధించిన కథా రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. రైటింగ్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ ను మరింత స్ట్రాంగ్ చేసే పనిలో ఆయన కూడా పాల్గొంటున్నారు. షూటింగ్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ప్రీ ప్రొడక్షన్ స్థాయిలోనే మంచి పునాది వేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.

రిషబ్ శెట్టి కెరీర్‌ను పరిశీలిస్తే, వేగం కంటే క్వాలిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకేసారి ఎక్కువ సినిమాలు పూర్తి చేయాలనే ఆతృత కంటే, ప్రతి ప్రాజెక్ట్‌కు అవసరమైన సమయాన్ని కేటాయించి, పాత్రల పరంగా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవ్వడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. అదే కారణంగా ప్రాజెక్టుల ఎంపిక నుంచి షూటింగ్ షెడ్యూల్ వరకు ప్రతి అంశంలో దీర్ఘకాలిక ప్రణాళికను అనుసరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక హీరో, డైరెక్ట‌ర్ అనే రెండు బాధ్యతలతోనే కాకుండా నిర్మాతగా కూడా రిషబ్ తన ప్రయాణాన్ని విస్తరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉన్న ఆయన, ఈ ఏడాదిలోనే కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. దీంతో క్రియేటివ్ డెసిష‌న్స్ తీసుకునే డైరెక్ట‌ర్ గా, విభిన్న పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకునే హీరోగా, కొత్త కథలను ప్రోత్సహించే నిర్మాతగా మూడు రంగాల్లోనూ తన ముద్ర వేయాలని రిషబ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. భారీ పాన్ ఇండియా సినిమాల‌తో రెండేళ్ల పాటు బిజీగా ఉండబోతున్నప్పటికీ, తన కెరీర్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన కాంతార ఫ్రాంచైజీని మాత్రం ఆయన ఎక్కడా వ‌ద‌ల‌డం లేదు. అందుకే ఇతర కమిట్‌మెంట్ల మధ్యలోనూ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు ఆగకుండా కొనసాగుతున్నాయి. సరైన టైమ్ వచ్చిన వెంటనే డైరెక్ట‌ర్ గా మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు రిషబ్ శెట్టి ఇప్పటికే పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News