ప్రియుడు మ‌ర‌ణంతో ఎన్నో అనుమానాలు...అవ‌మానాలు!

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి రియాలిటీ షో `ది ట్రైటర్స్` సీజన్ 2 లో పాల్గొన్న సందర్భంలో అమ్మ‌డు గత కష్టకాలం గురించి.. తీవ్రమైన విమర్శల గురించి బహిరంగంగా మాట్లాడారు.

Update: 2026-08-14 07:35 GMT

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి రియాలిటీ షో `ది ట్రైటర్స్` సీజన్ 2 లో పాల్గొన్న సందర్భంలో అమ్మ‌డు గత కష్టకాలం గురించి.. తీవ్రమైన విమర్శల గురించి బహిరంగంగా మాట్లాడారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌ తర్వాత రియా జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, సమాజం నుండి ఎదురైన నిందలు తనపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపాయో గుర్తు చేసుకున్నారు. సంవత్సరాల పాటు కొనసాగిన అనుమానాలు ..విచారణల వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని రియా చ‌క్ర‌వ‌ర్తి వాపోయారు.

ఈ రియాలిటీ షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఈ గేమ్‌లో `ఇన్నసెంట్` పాత్రలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు రియా స్పష్టం చేశారు. `ఈ ఏడాదే నాకు క్లీన్ చిట్ లభించింది. అసలు నేను నిర్దోషినని ఈ సంవత్సరమే అందరికీ స్పష్టంగా తెలిసింది` అని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు అనుమానాల నడుమ జీవించడం చాలా కష్టంతో కూడుకున్నదని... ఇకపై ఆ అనుమానాస్పద వాతావరణంలో ఉండలేనని భావోద్వేగానికి గురయ్యారు.

2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి జీవితం పూర్తిగా తలకిందులైంది. ఆ సమయంలో రియా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను, మీడియా ముట్టడిని ఎదుర్కొన్నారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా రియా ...ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ అవ్వ‌డం.. జైలు జీవితం గడపడం వంటి పరిణామాలు మానసికంగా కుంగదీశాయి.

అయితే కొన్ని నెలల క్రితం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకు సంబంధించి క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడంతో పాటు సుశాంత్ మరణానికి సంబంధించిన ఆరోపణల నుండి రియాకు పూర్తిగా క్లీన్ చిట్ లభించింది. ఈ చట్టపరమైన ఊరట తనకు ఎంతో శాంతినిచ్చిందని.. సుదీర్ఘ పోరాటం తర్వాత నిజం బయటపడిందని రియా తెలిపారు. ఆ కష్టకాలంలో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యలు మరియు పీటీఎస్‌డీ గురించి గత ఇంటర్వ్యూలలో కూడా రియా ధైర్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం `ది ట్రైటర్స్` సీజన్ 2 ప్రసారమవుతున్న తరుణంలో రియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నమ్మకం, అనుమానం, రహస్య గుర్తింపుల ఆధారంగా నడిచే ఈ రియాలిటీ గేమ్‌లో రియా భాగస్వామ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అన్ని అడ్డంకులను అధిగమించి రియా మళ్లీ వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగుతుండటాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News