దురంధ‌ర్ 2 (X) టాక్సిక్.. ఆర్జీవీ షాకింగ్ విశ్లేష‌ణ‌

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద అంశాలను ట‌చ్ చేస్తూ, విశ్లేషణాత్మక వ్యాఖ్యలతో చ‌ర్చ‌ల్లోకొస్తుంటారు.;

Update: 2026-02-22 12:52 GMT

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద అంశాలను ట‌చ్ చేస్తూ, విశ్లేషణాత్మక వ్యాఖ్యలతో చ‌ర్చ‌ల్లోకొస్తుంటారు. మార్చి 19న విడుదల కాబోతున్న ఆదిత్య ధర్ `దురంధర్ 2`, యష్ నటించిన `టాక్సిక్` సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరును ఆయన `దురాక్షిక్` క్లాష్‌గా అభివర్ణించారు.

వర్మ ట్వీట్ల సారాంశం, ఆయన ఉద్దేశం ప‌రిశీలిస్తే.. ఈ పోరాటాన్ని కేవలం ఇద్దరు హీరోల మధ్య లేదా రెండు భాషల మధ్య యుద్ధంగా దీనిని ఆర్జీవీ చూడటం లేదు. దీనిని ఆయన సినిమా విలువల మధ్య యుద్ధంగా పేర్కొన్నారు. ప్రేక్షకుల మేధస్సును గౌరవించే సినిమా గెలుస్తుందా? లేక కేవలం ఆడంబరాలకు ప్రాధాన్యతనిచ్చే సినిమా గెలుస్తుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఆర్జీవీ ఫేవరెట్ ఏది? దురంధర్ 2 వ‌ర్సెస్ టాక్సిక్?

వర్మ చాలా స్పష్టంగా `దురంధర్ 2` వైపే మొగ్గు చూపారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. దురంధ‌ర్ 2 సినిమా ప్రేక్షకుల మేధస్సును గౌరవిస్తుందని.. ఇందులో గ్రౌండెడ్ యాక్షన్.. బలమైన కథాంశం.. వాస్తవిక పాత్రలు ఉంటాయని వర్మ ప్రశంసించారు. ఆదిత్య ధర్ ప్రేక్షకులను తెలివైన వారిగా భావించి సినిమా తీస్తారని ఆయన నమ్మకం.

యష్ నటించిన టాక్సిక్ ప్రేక్షకుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేలా ఉంటుందని వర్మ విమర్శించారు. అతిశయోక్తి యాక్షన్ సీన్లు, భారీ బిల్డప్పులు, చెవులు పగిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఇందులో ఉంటాయని ఆయన అభిప్రాయం.

కేజీఎఫ్ 2 ప్రస్తావన ఎందుకు?

వర్మ `టాక్సిక్`ను విమర్శిస్తూ `కేజీఎఫ్ 2`ని ఉదాహరణగా తీసుకున్నారు. కేజీఎఫ్ 2 మాస్ ప్రేక్షకులలోని తెలివి తక్కువతనాన్ని టార్గెట్ చేసి హిట్ అయిందని.. కానీ దురంధర్ వంటి సినిమాలు ప్రేక్షకులు తెలివైన వారని నిరూపిస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజైతే సమస్యలేంటి?

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఎదురయ్యే సవాళ్లపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. అత‌డు సిద్ధాంత పరమైన చీలిక గురించి మాట్లాడారు. మార్చి 19న థియేటర్ల దగ్గర రెండు భిన్నమైన సినిమా ప్రపంచాల మధ్య యుద్ధం జరుగుతుందని ఆయన అన్నారు. కేవలం వందల కోట్లు ఖర్చు పెట్టి విజువల్స్ చూపించడం ముఖ్యం కాదు.. ఆ డబ్బును అర్థవంతమైన ఐడియాల కోసం వాడటం ముఖ్యమని ఆయన వాదించారు.

భారతదేశం `దురంధర్` వైపు ఉందా లేక టాక్సిక్ వైపు ఉందా అనేది మార్చి 19న తేలిపోతుంది అని ఆయన అన్నారు. ఇది భారతీయ సినిమా ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించే రోజు అని ఆయన పేర్కొన్నారు.

ఆర్జీవీ తన ట్వీట్ చివరలో ఒక డిక్లైమర్ కూడా ఇచ్చారు. నాకు ఆదిత్య ధర్ మీద ఉన్న ప్రేమతో ఇది రాయడం లేదు.. భారతీయ సినిమా మీద ఉన్న ఆశతో రాస్తున్నాను! అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన దృష్టిలో `దురంధర్ 2` బెస్ట్ సినిమా.. అది గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఆర్జీవీ అనుకున్న‌దానికి రివ‌ర్సులో విజ‌యం ప్ర‌త్య‌ర్థినే వ‌రించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. గ్లామ‌ర్ రంగంలో ఏదైనా జ‌ర‌గొచ్చు. ప్రేక్ష‌కుల‌కు ఏ సినిమా న‌చ్చుతుందో.. ఏది న‌చ్చ‌దో అంచ‌నా వేసిన మేధావులు చాలా మంది బోల్తా ప‌డ్డారు. కానీ ఆర్జీవీ అలా కాకూడ‌ద‌ని కోరుకుందాం.

Tags:    

Similar News