రెంటల్ వర్సెస్ పర్సంటేజ్.. థియేటర్స్ బంద్ తప్పదా?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన విధానంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది.;

Update: 2026-04-10 17:38 GMT

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన విధానంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాత రెంటల్ విధానాన్ని మార్చి, మల్టీప్లెక్సుల మాదిరిగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో టాలీవుడ్‌ లో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ విధానం అమల్లో ఉంది. అంటే సినిమా ఆడినా, ఆడకపోయినా నిర్మాతలు థియేటర్ యజమానికి ముందుగా నిర్ణయించిన అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ విధానం వల్ల థియేటర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి, ప్రేక్షకుల రాక తగ్గుతోంది, పెద్ద సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆదాయం తగ్గిపోతుందని వారు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో మల్టీప్లెక్సుల్లో అమలులో ఉన్న పర్సెంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్స్ లో ప్రవేశపెట్టాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. ఆ విధానం ప్రకారం సినిమా వసూళ్లలో ఒక భాగాన్ని థియేటర్ యాజమాన్యానికి ఇవ్వాలి. విడుదలైన తొలి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం థియేటర్లకు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు సూచిస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌ లోని సుమారు 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను నిర్మాతల గిల్డ్ వ్యతిరేకిస్తోంది. థియేటర్లకు ఇంత పెద్ద శాతం ఇవ్వడం సాధ్యం కాదని, ఇది నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల నిర్మాణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో, పర్సంటేజ్ విధానం అమలు చేస్తే నష్టాలు పెరుగుతాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రెంటల్ విధానాన్నే కొనసాగించాలని, ఆ విధానానికి ఒప్పుకునే థియేటర్లకే సినిమాలు ఇస్తామని గిల్డ్ స్పష్టం చేసింది.

ఇక నిర్మాతల గిల్డ్ వైఖరిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిలిం ఛాంబర్‌ ను పక్కనబెట్టి గిల్డ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రశ్నించింది. ఆ అంశంపై ఏప్రిల్ 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని డెడ్‌ లైన్ విధించింది. ఒకవేళ అప్పటికల్లా సమస్యకు పరిష్కారం రాకపోతే, మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎగ్జిబిటర్ల సంఘం హెచ్చరించింది.

ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సంటేజ్ విధానం విజయవంతంగా అమలవుతోందని ఎగ్జిబిటర్లు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో థియేటర్లు మూతపడితే బాక్సాఫీస్ వద్ద భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మొత్తంగా టాలీవుడ్ లో రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ వివాదంలో ఇరు వర్గాలు తమ వాదనలపై నిలబడుతున్న నేపథ్యంలో, ఏప్రిల్ 30లోగా పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News