డిజాస్టర్స్ దెబ్బ.. ఈ కసి నుంచి మరో కిక్ వస్తుందా?

ఆయన కూడా తన స్టామినా ఏంటో నిరూపించుకోవడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఇక రచయిత వక్కంతం వంశీ ట్రాక్ రికార్డు ఒకప్పుడు అద్భుతంగా ఉండేది.;

Update: 2025-12-17 04:34 GMT

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల మీద ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి వాటిలో మాస్ మాహారాజా రవితేజ, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, స్టార్ రైటర్ వక్కంతం వంశీ కాంబో ఒకటి. గతంలో కిక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ త్రయం ఇప్పుడు మళ్ళీ కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని టాక్. ఈ వార్త బయటకు రాగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ఈ కాంబినేషన్ ఎంత క్రేజీగా ఉందో, ఇప్పుడు వీరందరికీ హిట్ అనేది అంతే అవసరంగా మారింది. హీరో రవితేజ ఇటీవలే మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలతో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. బాక్సాఫీస్ దగ్గర వరుసగా రెండు డిజాస్టర్లు రావడంతో రవితేజ ఇప్పుడు కచ్చితంగా ఒక సాలిడ్ హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ షాక్ అయిన ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నారు.

ఆయన కూడా తన స్టామినా ఏంటో నిరూపించుకోవడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఇక రచయిత వక్కంతం వంశీ ట్రాక్ రికార్డు ఒకప్పుడు అద్భుతంగా ఉండేది. అశోక్, రేసుగుర్రం, ఊసరవెల్లి, టెంపర్, ఎవడు, కిక్ లాంటి సూపర్ హిట్ కథలను ఆయన అందించారు. కానీ ఎప్పుడైతే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారారో అక్కడ లెక్క తప్పింది. నా పేరు సూర్య, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.

సురేందర్ రెడ్డితో చేసిన ఏజెంట్ కథ కూడా వంశీదే. దీంతో ఇప్పుడు ఆయన మళ్ళీ పాత ట్రాక్ లోకి వచ్చి, కేవలం రచయితగా తన బలాన్ని నమ్ముకుని సురేందర్ రెడ్డితో చేతులు కలిపారు. ఈ ముగ్గురు కలుస్తున్నారంటే అది కచ్చితంగా కిక్ 3 అయి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతంలో వచ్చిన కిక్ 2 సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, కిక్ సీక్వెల్ వైపు వెళ్లాలా లేక పూర్తిగా కొత్త కథతో రావాలా అనే సందిగ్ధంలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి తప్ప, స్టోరీ ఇంకా లాక్ కాలేదని సమాచారం. ముగ్గురూ తమ కెరీర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయం ఇది. కాబట్టి ఈసారి చేసే ప్రయోగం వికటించకూడదు. అందుకే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

రవితేజ ఎనర్జీ, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్, వక్కంతం వంశీ మార్క్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా కుదిరితేనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అందరికీ నమ్మకం కలిగేలా ఒక బలమైన పాయింట్ దొరకాలి. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ మీద అందరి ఫోకస్ పడింది. ముగ్గురూ కసి మీద ఉన్నారు కాబట్టి, అవుట్ పుట్ కూడా అంతే బలంగా రావచ్చు. రొటీన్ కథలతో కాకుండా, ప్రేక్షకులను మెప్పించే కొత్త కంటెంట్ తో వస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం. మరి ఈ మాస్ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News